కలం, నిర్మల్: నిర్మల్ నియోజకవర్గంలో సాగునీటి సౌకర్యాల మెరుగుదలకు రూ.1.26 కోట్లకు పైగా నిధులు మంజూరయ్యాయని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (MLA Alleti) మంగళవారం తెలిపారు. లక్ష్మణచాంద, నిర్మల్ రూరల్, సారంగాపూర్ మండలాల పరిధిలో నాలుగు కీలక పనులకు నిధులు ఆమోదం పొందాయని పేర్కొన్నారు. వడ్యాల్ గ్రామ సమీపంలోని ఎస్సారెస్పీ ప్రధాన కాలువపై సూపర్ పాసేజ్ పునర్నిర్మాణానికి రూ.66 లక్షలు, రాచాపూర్ గ్రామ సమీపంలోని కాలువపై సూపర్ పాసేజ్ పునర్నిర్మాణానికి రూ.39.40 లక్షలు కేటాయించారని ముజ్గి – సాంగ్వి లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలో సాంగ్వి గ్రామం వద్ద ప్రెజర్ మెయిన్స్ పైపులైన్ లీకేజీల నివారణ, మరమ్మతులకు రూ.17.20 లక్షలు, సారంగాపూర్ మండలం లింగాపూర్ చెరువు దిగువన లోలెవల్ కాజ్‌వే అప్రోచ్ రోడ్డు శాశ్వత మరమ్మతులకు రూ.4.25 లక్షలు కేటాయించారని పేర్కొన్నారు. ఈ పనులు పూర్తయితే కాలువల నిర్వహణ మెరుగుపడటంతో పాటు లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలోని సమస్యలు పరిష్కారమై రైతులకు సాగునీటి సరఫరాలో ఇబ్బందులు తగ్గనున్నాయని, నియోజకవర్గంలో సాగునీటి వనరుల అభివృద్ధికి, రైతుల అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ నిధుల మంజూరుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

