కలం, వరంగల్ బ్యూరో: వరంగల్‌లోని మహాత్మా గాంధీ మెమోరియల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి (MGM Hospital) ప్రాంగణంలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి (Collector Chahat Bajpai) అధికారులను ఆదేశించారు. ఆసుపత్రి ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దడంతోపాటు నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సూచించారు.
గురువారం ఎంజీఎం ఆసుపత్రి ప్రాంగణంలో జరుగుతున్న పనులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కాంపౌండ్ వాల్స్, ప్రధాన ద్వారం (మెయిన్ ఆర్చ్), పార్కింగ్ ప్రాంతాలు, గార్డెనింగ్, ఫైబర్ రీన్ఫోర్స్డ్ ప్లాస్టిక్ (ఎఫ్ఆర్పీ) ప్యానెళ్ల ఏర్పాటు పనుల పురోగతిని సమీక్షించారు. పనుల్లో జాప్యం జరగకుండా సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పరిశీలనలో ఆర్అండ్బీ ఎస్ఈ సురేష్‌బాబు, ఈఈ దేవిక చౌహన్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎస్ఈ రాజ్‌కుమార్, ఎల్అండ్టీ ప్రతినిధులు శరవణకుమార్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

