ఎస్ఐఆర్‌ ప్రక్రియపై ఎన్నికల పరిశీలకురాలి సమీక్ష

కలం, కరీంనగర్: అర్హులైన ఏ ఒక్కరూ ఓటు హక్కుకు దూరం కాకుండా ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల జాబితా పరిశీలకులు బాల మాయాదేవి (Bala Maya Devi) సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఐడీఓసీలో కలెక్టర్ చిత్రా మిశ్రా, ఈఆర్వోలుగా వ్యవహరిస్తున్న అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, హుజురాబాద్ ఆర్డీవో జల కుమారి, ఏఈఆర్వోలతో కలిసి ఎస్ఐఆర్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రక్రియ పురోగతిని తెలుసుకున్నారు. ఫారం-6, 7, 8లకు సంబంధించి వచ్చిన దరఖాస్తులు, వాటి పరిష్కార వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా పరిశీలకులు మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో బీఎల్వోలు నిబంధనలు పాటించేలా అధికారులు పక్కాగా చర్యలు తీసుకోవాలని సూచించారు. క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తూ ప్రక్రియను పర్యవేక్షించాలన్నారు. ఓటరు జాబితా నుంచి ఓటును తొలగించడానికి గల కారణాలను బీఎల్వోలు తప్పనిసరిగా నమోదు చేసేలా చూడాలని పేర్కొన్నారు. ఫిర్యాదులకు తావులేకుండా ప్రక్రియను పూర్తి చేయాలని, ధ్రువీకరణ పత్రాల పరిశీలనను నిర్ణీత గడువులోగా ముగించాలని సూచించారు. తొలగించిన ఓట్లకు సంబంధించిన కారణాలను రికార్డుల్లో స్పష్టంగా నమోదు చేయాలని ఆదేశించారు.

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇందుకోసం ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకునేలా ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. మానకొండూర్ నియోజకవర్గంలో చేపడుతున్న చర్యలను అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, హుజురాబాద్ నియోజకవర్గంలో తీసుకుంటున్న చర్యలను ఆర్డీవో జల కుమారి, చొప్పదండి నియోజకవర్గంలో చేపడుతున్న చర్యలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, కరీంనగర్ నియోజకవర్గంలో ఎస్ఐఆర్ ప్రక్రియపై తీసుకుంటున్న చర్యలను మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ వివరించారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. రాజకీయ పార్టీల నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ ఎస్ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మృతిచెందిన వారు, ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వలస వెళ్లిన వారు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఉపాధి పొందుతున్న వారి ఓటర్ల జాబితాలను క్రాస్ వెరిఫికేషన్, సూపర్ చెక్ చేస్తూ ముందుకు సాగుతున్నట్లు వివరించారు.

కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ.. ఓటరు జాబితా నుంచి తొలగించిన ఓట్లపై ప్రత్యేక దృష్టి సారించి, అందుకు గల కారణాలను నమోదు చేయాలని ఆదేశించారు. సంబంధిత ధ్రువీకరణ పత్రాలను భద్రపరచాలని సూచించారు. మృతిచెందిన వారి ఓట్లు, రెండు చోట్ల నమోదైన ఓట్ల తొలగింపు విషయంలో తప్పనిసరిగా కుటుంబ సభ్యుల అనుమతి తీసుకోవాలని తెలిపారు. బీఎల్వోలు రికార్డులను తప్పనిసరిగా నిర్వహించాలని, క్షేత్రస్థాయిలో నిబంధనల ప్రకారం వెరిఫికేషన్ చేస్తూ గ్రామాలు, మండలాల వారీగా జాబితాలను సిద్ధం చేయాలని ఆదేశించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>