కలం, ఖమ్మం బ్యూరో: జాతీయ స్థాయి క్రీడా సంబరానికి తెలంగాణ సిద్ధమైందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రాన్ని దేశ క్రీడా రాజధానిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao) అన్నారు. డిసెంబర్ 11 నుంచి 22 వరకు తెలంగాణలో జరగనున్న ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026’ లోగో, మస్కట్, బ్రోచర్లను గురువారం ఖమ్మంలోని శ్రీ భక్త రామదాసు కళాక్షేత్రంలో ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, జాతీయ స్థాయి క్రీడా పోటీలకు తెలంగాణ వేదిక కావడం గర్వకారణమని పేర్కొన్నారు. సుమారు 26 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో ఈ స్థాయి క్రీడలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి దృఢ సంకల్పంతో ముందుకు వచ్చారని తెలిపారు. క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణ, మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించి, ముఖ్యంగా గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికితీసి అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించేలా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు.
ఖేలో ఇండియా క్రీడల్లో భాగంగా ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలను నిర్వహించనున్నట్లు మంత్రి (Minister Tummala) వెల్లడించారు. 26 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ స్టేడియంలోని క్రీడా సౌకర్యాలను ఆధునీకరించడానికి అవసరమైన నిధులను మంజూరు చేస్తున్నామని, రానున్న 20 ఏళ్ల పాటు క్రీడాకారులకు ఎలాంటి లోటు లేకుండా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. డిసెంబర్ 17 నుంచి 21 వరకు ఖమ్మంలో జరగనున్న ఆర్చరీ పోటీలకు ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో విచ్చేసి క్రీడాకారులను ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు.
యువతలో క్రీడా స్ఫూర్తి నింపడంతో పాటు, తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడల వైపు ప్రోత్సహించి భవిష్యత్ అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ కార్యక్రమంలో శిక్షణ సహాయ కలెక్టర్ పారస్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ ఖాదర్ బాబా, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతరావు, మెప్మా పీడీ నళినీ పద్మావతి, ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

