అకాల వర్షం.. కోనాపూర్ రైతులకు తీరని నష్టం

కలం, మెదక్ బ్యూరో: మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో బుధవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షం రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చే సమయంలో కురిసిన అకాల వర్షం అన్నదాతలను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ముఖ్యంగా కోనాపూర్ (Konapur) గ్రామంలో సుమారు 30 మంది రైతులు కోత కోసిన ధాన్యాన్ని గ్రామంలోని బండపై ఆరబోసి ఉంచారు. అయితే అర్ధరాత్రి అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షానికి ధాన్యం తడిసి ముద్దవడమే కాకుండా, వరద నీటికి కొట్టుకుపోయి మట్టిలో కలిసిపోయింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.

పంట సాగు కోసం అప్పులు చేసి పెట్టుబడులు పెట్టామని, తీరా పంట చేతికొచ్చే సమయంలో వర్షం తమ ఆశలపై నీళ్లు చల్లిందని బాధిత రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. ధాన్యం పూర్తిగా దెబ్బతినడంతో పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి వైపరీత్యంతో నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. సంబంధిత వ్యవసాయ, రెవెన్యూ అధికారులు గ్రామాన్ని సందర్శించి పంట నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, నష్టపోయిన ప్రతి రైతుకు తగిన పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పంట పండించేందుకు నెలల తరబడి శ్రమించిన రైతులకు చివరకు చేతికొచ్చిన ధాన్యం కూడా దక్కకపోవడంతో రామాయంపేట మండలంలో విషాదం నెలకొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>