కలం, వెబ్ డెస్క్ : హన్మకొండ (Hanamkonda)లో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఒక వివాహితపై అత్యాచారానికి పాల్పడిన సబ్ ఇన్స్పెక్టర్ (SI) గోదారి రాజ్ కుమార్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో హన్మకొండ పోలీస్ స్టేషన్ లో పని చేసిన సమయంలో, బాధితురాలు తన భర్తపై ఫిర్యాదు చేయడానికి అక్కడికి వచ్చింది. ఆ సమయంలో ఆమెకు సహాయం చేస్తానని నమ్మించిన ఎస్ఐ రాజ్ కుమార్, ఆమెకు భర్తతో విడాకులు ఇప్పించి తానే పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు.
తనకు కొడుకు లేడని, తన కోరిక తీర్చాలని కోరుతూ సదరు వివాహితను లోబరుచుకున్నాడు. తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో బాధితురాలు పలుమార్లు గర్భవతి కాగా, ఇటీవల ఆమెకు బలవంతంగా అబార్షన్ మాత్రలు ఇచ్చాడు. దీంతో ఆమెకు తీవ్ర రక్తస్రావమై అనారోగ్యానికి గురైంది. జరిగిన మోసాన్ని గ్రహించిన బాధితురాలు తనను పెళ్లి చేసుకోవాలని నిలదీయడంతో, ఎస్ఐ రాజ్ కుమార్ అసలు స్వరూపాన్ని బయటపెట్టాడు. పెళ్లి మాటెత్తితే ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలను బయటపెడతానంటూ బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు.
అంతేకాకుండా, నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తే ఇదే పోలీస్ శాఖలో ఉన్న SL తమ్ముడు రవికుమార్ నీ అంతు చూస్తాడని బాధితురాలిని తీవ్రంగా బెదిరించాడు. ఎస్ఐ చేతిలో మోసపోయిన బాధితురాలు, చివరకు తనకు న్యాయం చేయాలని కోరుతూ ఐజీ (IG) ని ఆశ్రయించింది. ఐజీ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన హన్మకొండ పోలీసులు నిందితుడైన ఎస్ఐ గోదారి రాజ్ కుమార్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

