Mobile Popup Ad
Mobile Popup Ad

ముంచుకొస్తున్న ఎల్‌నినో ముప్పు.. మహాసముద్రంలో డేంజర్ బెల్స్

కలం, వెబ్ డెస్క్: ఎల్‌నినో ముప్పు (El Nino Threat) ముంచుకొస్తున్నదని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలపై ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని వెల్లడించింది. పసిఫిక్ మహాసముద్రంలోని భూమధ్యరేఖ వద్ద ఎల్‌నినో డేంజర్ బెల్స్ మోగుతున్నట్టు తెలిపింది. మధ్య, తూర్పు పసిఫిక్ మహాసముద్ర ప్రాంతాల్లో సముద్రజలాల ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయని.. ఎల్‌నినో పరిస్థితులను నిర్ధారించే కీలక సూచీ అయిన నినో-3.4 ఇండెక్స్ 0.5 ప్లస్ డిగ్రీల సెల్సియస్‌ స్థాయిని అధిగమించినట్లు ఐఎండీ వెల్లడించింది.

ఏం జరగబోతున్నది?

ఎల్‌నినో ప్రభావంతో దేశంలో రుతుపవనాల వర్షపాతం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వర్షాలు తగ్గడం, ఉష్ణోగ్రతలు పెరగడం, ఎక్కువకాలం పొడి వాతావరణం కొనసాగడం, కొన్ని ప్రాంతాల్లో కరువు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ఐఎండీ అంచనాల ప్రకారం జూన్ నుంచి ఆగస్టు వరకు ఎల్‌నినో ప్రభావం కొనసాగనుండగా, జూలై తర్వాత బలపడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రుతుపవనాల పనితీరుపై వాతావరణ నిపుణులు ప్రత్యేకంగా నిఘా ఉంచుతున్నారు.

ఆందోళన అక్కర్లే

పరిస్థితి పూర్తిగా ఆందోళనకరంగా ఏమీలేదని వాతావరణశాఖ చెబుతోంది. ప్రస్తుతం హిందూ మహాసముద్రంలో ఇండియన్ ఓషన్ డైపోల్ (ఐఓడీ) తటస్థ స్థితిలో ఉందని తెలిపింది. మరోవైపు జూలైలో సానుకూల ఐఓడీ ఏర్పడే అవకాశం ఉందని జపాన్ వాతావరణ సంస్థ అంచనా వేసింది. అది జరిగితే ఎల్‌నినో ప్రతికూల ప్రభావాన్ని కొంత మేర తగ్గించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో మారుతున్న పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, రాబోయే నెలల్లో తాజా అంచనాలను విడుదల చేస్తామని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

ఓషన్ డైపోల్ బులెటిన్ విడుదల

2026 జూన్ సంబంధించిన ఎన్‌సో (ఈఎన్ ఎస్ వో), ఇండియన్ ఓషన్ డైపోల్ (ఐఓడీ) బులెటిన్‌ను ఐఎండీ విడుదల చేసింది. మధ్య, తూర్పు పసిఫిక్ మహాసముద్ర ప్రాంతాల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఎల్‌నినోకు అవసరమైన స్థాయిని దాటినట్లు వెల్లడించింది. సముద్ర జలాల వేడిమికి అనుగుణంగా వాతావరణ వ్యవస్థ కూడా స్పందించిందని, దీంతో సముద్ర వాతావరణ సంయుక్త వ్యవస్థ పూర్తిస్థాయిలో ఎల్‌నినో స్థితిలోకి ప్రవేశించినట్లు పేర్కొంది. మాన్సూన్ మిషన్ కపుల్డ్ ఫోర్‌కాస్ట్ సిస్టమ్ (ఎంఎంసీఎఫ్ ఎస్) అంచనాల ప్రకారం, రుతుపవనాల సీజన్ కొనసాగేకొద్దీ ఎల్‌నినో తీవ్రత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. భారత రుతుపవనాలపై ప్రభావం చూపేది కేవలం ఎల్‌నినో మాత్రమే కాదని ఐఎండీ స్పష్టం చేసింది. ప్రస్తుతం హిందూ మహాసముద్రంలో ఇండియన్ ఓషన్ డైపోల్ తటస్థ స్థితిలో ఉందని, ఈ పరిస్థితులు రుతుపవనాల సీజన్ అంతా కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. తటస్థ ఐఓడీ కారణంగా ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావాన్ని గణనీయంగా తగ్గే అవకాశం ఉందని తెలిపింది.

జపాన్ ప్రకటనతో ఊరట

జూన్ 11న ఎల్‌నినో ప్రారంభమైనట్లు ప్రకటించిన జపాన్ వాతావరణ సంస్థ (జేఎంఏ) భారత్‌కు కొంత ఊరటనిచ్చే అంచనాలను వెల్లడించింది. జూలై ప్రాంతంలో సానుకూల ఇండియన్ ఓషన్ డైపోల్ అభివృద్ధి చెందే అవకాశం ఉందని తెలిపింది. అది ఏర్పడితే సూపర్ ఎల్‌నినోగా మారే అవకాశమున్న ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావాన్ని కొంత మేర తగ్గించగలదని పేర్కొంది.

వ్యవసాయంపై ఎఫెక్ట్

ఎల్‌నినో ప్రభావం వ్యవసాయంపైనే అత్యధికంగా ఉంటుంది. వర్షాధార పంటలకు తీవ్రమైన నష్టం కలిగించే చాన్స్ ఉంది. నీటి కొరత ఏర్పడితే దిగుబడులు తగ్గవచ్చు. రిజర్వాయర్లు, చెరువుల్లోకి వచ్చే నీరు తగ్గే అవకాశం ఉంటుంది. తాగునీటి సమస్యలు తలెత్తవచ్చు. వర్షాలు గణనీయంగా తగ్గితే కొన్ని ప్రాంతాల్లో కరువు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. భారత వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఎల్‌నినో ఇప్పటికే ప్రారంభమైంది. జూలై నుంచి సెప్టెంబర్ మధ్య దీని ప్రభావం పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే రుతుపవనాలపై ప్రభావం ఎంతవరకు ఉంటుందనేది ఇండియన్ ఓషన్ డైపోల్ పరిస్థితులపై కూడా ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>