కలం డెస్క్ : HAM Roads | రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న హ్యామ్ (Hybrid Annuity Model) విధానానికి గ్రహణం పట్టిందా?.. ప్రైవేటు కంపెనీలు ఆసక్తి చూపడంలేదా?.. కాంట్రాక్టర్లకు నమ్మకం కుదరడంలేదా?.. అందుకే టెండర్ (Tender) ప్రాసెస్ ఆలస్యమవుతున్నదా?.. ఇలాంటి అనేక అంశాలపై అధికారుల్లో ఆందోళన నెలకొన్నది. ప్రభుత్వం ఆశించినంత వేగం ఆచరణలో కనిపించకపోవడంతో ఆలోచనలో పడింది. దీంతో పలువురు బ్యాంకర్లు, కాంట్రాక్టర్లతో రోడ్లు-భవనాల శాఖ (R&B) శుక్రవారం నగరంలో సమావేశమవుతున్నది. పంచాయతీ రోడ్లతో పాటు ఆర్ అండ్ బీ రోడ్ల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న హ్యామ్ విధానం ఎక్కడ బెడిసికొడుతున్నదో తెలుసుకోవాలనుకుంటున్నది. టెండర్లు దాఖలు చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చి రెండు నెలలవుతున్నా వాటి ప్రాసెస్ ఆలస్యం కావడానికి కాంట్రాక్టర్ల నుంచి సరైన స్పందన లేకపోవడమేనని ప్రభుత్వం ఒక ప్రాథమిక నిర్ణయానికి వచ్చింది.
డబ్బు చుట్టూ ముడిపడిన అంశాలు :
రాష్ట్రంలో పంచాయతీ, ఆర్ అండ్ బీ రోడ్ల నిర్మాణాన్ని హ్యామ్ పద్ధతిలో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం సుమారు 7,449 కి.మీ. మేర గ్రామీణ రోడ్ల (పంచాయతీరాజ్) నిర్మాణానికి దాదాపు రూ. 6,294 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. మొత్తం 2,162 ప్యాకేజీలుగా ఈ రోడ్లను విభజించింది. అక్టోబరు 17న టెండర్లను ఆహ్వానించింది. నవంబరు-డిసెంబరులో టెండర్లను ఓపెన్ చేసి బిడ్డర్లను ఫైనల్ చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ ఎన్ని కంపెనీలు టెండర్లను దాఖలు చేశాయనే అంశాన్ని అధికార వర్గాలు వెల్లడించడంలేదు. మరోవైపు ఆర్ అండ్ బీ రోడ్ల విషయంలో రెండు దశల్లో సుమారు 5,824 కి.మీ. రోడ్ల నిర్మాణానికి రూ. 11,399 కోట్లతో టెండర్ నోటిఫికేషన్‌ను అక్టోబరు 23న విడుదల చేసింది. మొదటి ఫేజ్‌లో రూ. 6,478 కోట్ల ఖర్చుతో 5,190 కి.మీ. రోడ్ల నిర్మాణాన్ని చేపట్టాలనుకున్నది. మిగిలిన రోడ్లను సెకండ్ ఫేజ్‌లో చేపట్టాలనుకున్నది.
టెండర్ దాఖలుపై కాంట్రాక్టర్లకు తగ్గిన ఆసక్తి :
ప్రభుత్వం భావించినట్లుగా హ్యామ్ పద్ధతిలో రోడ్ల (HAM Roads) నిర్మాణంలో పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP)గా ప్రభుత్వం 40%, ప్రైవేటు సంస్థలు 60% చొప్పున భరించాలి. రోడ్ల నిర్వహణ బాధ్యత ప్రైవేటు కంపెనీలదే. రోడ్లను నిర్మించే డెవలప్ మొత్తం ఖర్చును తొలుత భరిస్తే ఆ తర్వాత ప్రభుత్వం తన వాటాను చెల్లిస్తుంది. ఇందుకోసం కంపెనీలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటాయన్న అభిప్రాయం వ్యక్తమైంది. కానీ బ్యాంకులు రుణం ఇవ్వడానికి ముందుకు రాని కారణంగానే టెండర్లు ఆశించినంత స్థాయిలో దాఖలు కాలేదన్న మాటలు అధికారవర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఈ పద్ధతిలో జరిగే రోడ్ల నిర్మాణంలోని ఇబ్బందులను సమీక్షించి ప్రత్యామ్నాయం గురించి ఆలోచించడంలో భాగంగా బ్యాంకర్లు, కాంట్రాక్టర్లతో రోడ్లు భవనాల శాఖ అధికారులు శుక్రవారం సమావేశం అవుతున్నారు. చర్చల తర్వాత ఎలాంటి నిర్ణయం జరుగుతుందన్నది ఆసక్తికరం.
Read Also: ‘సుప్రీం’ సీనియర్ అడ్వొకేట్‌గా TG హైకోర్టు మాజీ సీజే
Follow Us On: Instagram


