కలం డెస్క్ : తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా పనిచేసిన అభినంద్ కుమార్ షావిలి (Abhinand Kumar Shavili) తన రిటైర్‌మెంట్ తర్వాత సీనియర్ అడ్వొకేట్‌గా కొత్త ప్రస్థానాన్ని మొదలుపెట్టనున్నారు. ఈ ఏడాది సెప్టెంబరు అక్టోబర్ 10న ఆయన హైకోర్టు జడ్జిగా రిటైర్ అయ్యారు. ఇకపైన కూడా న్యాయవాద వృత్తినే కొనసాగించాలి అనుకున్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని పలువురు జడ్జీలు డిసెంబరు 10న సమావేశమై ఆయనను సీనియర్ అడ్వొకేట్‌గా గుర్తిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ఆయన సీనియర్ అడ్వొకేట్‌గా కొనసాగనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు హైకోర్టు ఉమ్మడిగా పనిచేస్తున్న కాలంలోనే (2017 సెప్టెంబరులో) ఆయన హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. ఆ తర్వాత తెలంగాణకు ప్రత్యేక హైకోర్టుగా ఆవిర్భవించిన తర్వాత దీనిలోనే జడ్జిగా కొనసాగారు.
తొమ్మిది రోజుల పాటు చీఫ్ జస్టిస్‌గా :
తెలంగాణ హైకోర్టు (Telangana High Court) చీఫ్ జస్టిస్‌గా దాదాపు ఏడాదికి పైగా పనిచేసిన జస్టిస్ ఉజ్వల్ భుయాన్ సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందిన తర్వాత ఒక రోజు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ (తెలంగాణ హైకోర్టు)గా పీ నవీన్‌రావు పనిచేశారు. ఆ మరుసటి రోజు నుంచి (2023 జూలై 15 నుంచి 23 వరకు) తొమ్మిది రోజుల పాటు జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి (Abhinand Kumar Shavili) తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా వ్యవహరించారు. ఈయన తర్వాతనే జస్టిస్ అలోక్ ఆరధే చీఫ్ జస్టిస్‌గా నియమితులయ్యారు. హైకోర్టు జడ్జిగా 2017లో నియమితులు కావడానికి ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరించారు. ప్రముఖ న్యాయవాది నూతి రామ్మోహన్‌రెడ్డి దగ్గర అడ్వొకేట్‌గా గుర్తింపు పొందిన అభినంద్ కుమార్ షావిలి నిజాం కాలేజీ నుంచి డిగ్రీని, ఉస్మానియా వర్శిటీ నుంచి ఎల్ఎల్‌బీ పట్టాను అందుకున్నారు. దాదాపు ఎనిమిదేండ్ల పాటు హైకోర్టు జడ్జిగా పనిచేసిన జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి ఇకపైన సీనియర్ అడ్వొకేట్‌గా కోర్టుల్లో కనిపించనున్నారు.
Read Also: పాకిస్థాన్ ఎఫ్16ల ఆధునికీకరణకు అమెరికా డీల్
Follow Us On: X(Twitter)


