కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షం (Heavy Rains) కురిసింది. నగరంలోని ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్ ఏరియాల్లో వడగళ్ల వాన బీభత్సాన్ని సృష్టించింది. భాగ్యలత, సాహెబ్‌నగర్, గాయత్రీనగర్, బ్యాంక్ కాలనీ తదితర ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. దీంతో రోడ్లన్నీ జలమయమ్యాయి. వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. అబ్దుల్లాపూర్ మెట్ నుంచి ఎల్బీనగర్ వరకు పలు ప్రాంతాల్లో వాన జోరుగా కురుస్తోంది. జాతీయ రహదారి పైకి నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరికాసేపట్లో నగరం అంతటా వర్షాలు విస్తరిస్తామని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఇక రాష్ట్రంలోని చేవెళ్ల, మొయినాబాద్, షాద్‌నగర్, వికారాబాద్, నారాయణపేట, మెదక్, రామాయంపేట, నాగర్‌కర్నూల్, యాదాద్రి, బెల్లంపల్లి, మంచిర్యాలలో వచ్చే 2 గంటలకు అక్కడక్కడా ఉరుములు మెరుపులతో వర్షాలు పడతాయని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేసింది.
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు..
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే రెండ్రోజులు వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం అకస్మాత్తుగా ఈదురు గాలులు, ఉరుములతో భారీ వర్షం కురిసింది. పలు చోట్ల రహదారులపై భారీగా వరద చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. గచ్చిబౌలి వంతెనపై, ఐకియా, రాయదుర్గం ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మణికొండలో వడగళ్ల వాన కురిసింది. బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్‌బాగ్, లిబర్టీ, హిమాయత్ నగర్, లక్డీకాపుల్, కుత్బుల్లాపూర్ తదితర ప్రాంతాల్లో రహదారులపై వరదనీరు చేరుకుంది. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది.
Read Also: పార్టీ ఏర్పాటుపై శ్రీరామనవమి రోజున కవిత ప్రకటన?
Follow Us On: Facebook

