కలం, వెబ్ డెస్క్: బంగ్లాదేశ్ (Bangladesh) మరోసారి రణరంగంగా మారింది. నిరసనలతో ఆ దేశం అట్టుడుకుతున్నది. రాడికల్ నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్యతో (Osman Hadi Killing) ఆందోళనకారులు రెచ్చిపోయారు. దేశంలోని ప్రముఖ మీడియా సంస్థలకు నిప్పు పెట్టారు. హాదీని చంపిన హంతకులను పట్టుకొనేవరకు తమ నిరసనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. గత శుక్రవారం ఢాకాలో గుర్తుతెలియని దుండగులు హాదీపై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన హాది సింగపూర్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
హాది మరణవార్త తెలియగానే ఢాకా సహా పలు నగరాల్లో వేలాది మంది రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. హంతకులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఢాకాలోని పలు భవనాలకు, దేశంలోని ప్రముఖ దినపత్రికలకు నిప్పు పెట్టారు. ‘ది డైలీ స్టార్’, ‘ప్రథమ్ ఆలో’ కార్యాలయాలు ఉన్న భవనాలకు నిప్పంటించారు. ఈ ఘటనల్లో పత్రికల సిబ్బంది లోపలే చిక్కుకొని నరకం అనుభవించారు. గురువారం రాత్రంతా పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగడంతో అదనపు పోలీసులు, అర్ధసైనిక బలగాలను మోహరించారు. ‘ది డైలీ స్టార్’ కార్యాలయంలో చెలరేగిన మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు అగ్నిమాపక శాఖ వెల్లడించింది.
ఎవరీ ఉస్మాన్ హాది ?
షరీఫ్ ఉస్మాన్ హాది బంగ్లాదేశ్(Bangladesh)కు చెందిన విప్లవ యువ నాయకుడు. 2024లో దేశంలో జరిగిన విద్యార్థి ఉద్యమం సమయంలో ఆయనకు గుర్తింపు లభించింది. ఆ ఉద్యమమే తీవ్ర రూపం దాల్చి అప్పటి ప్రధాని షేక్ హసీనాను అధికారంలో నుంచి తప్పించడానికి కారణమైంది. హాదీ నిత్యం భారత్‌కు వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తుంటారు. యువతలో కొంతమంది అభిమానాన్ని సంపాదించుకున్నప్పటికీ, అదే సమయంలో తీవ్ర విమర్శలకు కూడా గురయ్యారు.
Read Also: నేటి నుంచి 38వ జాతీయ పుస్తక ప్రదర్శన
Follow Us On: Sharechat


