పవన్.. భాష మార్చుకో : గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైర్

కలం, నల్లగొండ: ఆంధ్రప్రదేశ్ అధికార కూటమి నేతల వైఖరి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరుపై తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukhender Reddy) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నల్గొండలో ఆయన మీడియాతో చిట్‌చాట్ లో మాట్లాడుతూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ తెలంగాణలో బహిరంగ సభ నిర్వహించాలనుకోవడం సరికాదని గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణ సెంటిమెంట్‌పై కనీస అవగాహన ఉన్నవారెవరూ ఇక్కడ సభలు పెట్టడానికి సాహసించరని అన్నారు.

ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ తన రాజకీయ భాషను మార్చుకోవాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు హైదరాబాద్‌ను వదిలి అమరావతిలోనే నివాసం ఉండాలని గుత్తా డిమాండ్ చేశారు. “కూటమి నేతలు ఏపీ – తెలంగాణ రాష్ట్రాల మధ్య షటిల్ ట్రిప్‌లు వేయడం ఆపాలి. హైదరాబాద్‌లో ఉంటూ ఏపీని పాలించడం ఏంటి? ఇప్పటికైనా వారు తెలంగాణపై కాకుండా ఏపీ అభివృద్ధిపై దృష్టి పెడితే మంచిది” అని ఆయన వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ నాయకులు అనుసరిస్తున్న కొన్ని విధానాల వల్ల భవిష్యత్తులో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య శాశ్వత వైషమ్యాలు, విభేదాలు ఏర్పడే ప్రమాదం ఉందని గుత్తా హెచ్చరించారు.

ముఖ్యంగా కృష్ణా జలాల పంపిణీ విషయంలో ఇప్పటికీ తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, మన నీటి వాటాను మనం దక్కించుకోవాల్సి ఉందన్నారు. ఇదే సమయంలో కేంద్రంలోని అధికార బీజేపీపై కూడా ఆయన మండిపడ్డారు. అవకాశం వచ్చిన ప్రతిసారీ బీజేపీ అగ్రనేతలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తప్పుబడుతూ, రాష్ట్ర విభజన ప్రక్రియపై విషం కక్కుతున్నారని గుత్తా సుఖేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ హక్కుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>