కలం, వెబ్ డెస్క్: ఆధునిక జీవితమో.. వెస్ట్రన్ కల్చర్ ప్రభావమో.. కారాణాలు ఏమైనా ఈతరం దంపతులు పిల్లలు వద్దనుకుంటున్నారు. లక్షణంగా లక్షల్లో జీతమున్నా సరే విలాసాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో గురుగ్రామ్‌కు (Gurugram) చెందిన దంపతులు ఏడాదికి రూ. 36 లక్షల ఆదాయం సంపాదిస్తున్నారు. అయినప్పటికీ పిల్లలు వద్దనే (DINK – Double Income, No Kids) నిర్ణయాన్ని తీసుకోవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. వారి బంధువు హర్ష్ గుప్తా థ్రెడ్స్ వేదికగా ఈ విషయాన్ని పంచుకోవడంతో వైరల్‌గా మారింది.
పెరుగుతున్న ధరలే కారణం
సదరు వ్యక్తి నెలకు రూ. 2 లక్షలు, అతని భార్య రూ. 1 లక్ష సంపాదిస్తున్నారు. మూడు లక్షలు అంటే మంచి జీతమే. నగరంలో పెరుగుతున్న జీవన వ్యయం కారణంగా వారు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నిర్ణయానికి ప్రధాన కారణం గురుగ్రామ్‌లో (Gurugram) ఆకాశాన్నంటుతున్న రియల్ ఎస్టేట్ ధరలు, విద్యార్థుల ఫీజులేనని పేర్కొన్నారు. నెలకు రూ. 3 లక్షల ఆదాయం ఉన్నా, కనీసం ఒక మంచి 1BHK ఫ్లాట్ కొనడం కూడా భారంగా మారిందని ఆ దంపతులు వాపోతున్నారు. సొంతానికి తగినంత స్థలం లేని చోట, పిల్లలను పెంచడం అసాధ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రైవేట్ పాఠశాలల ఫీజుల కోసం నెలకు రూ. 35 వేల నుండి 40 వేల వరకు కేటాయించడం తమ ఆర్థిక స్థితికి మించిన పనేనని అభిప్రాయపడుతున్నారు.
నగరాల్లో ఎక్కువగా..
ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో నగరాల్లోని మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాలవారు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు ఈ ఉదంతం ఒక అద్దం పడుతోంది. ఆర్థిక భద్రత పిల్లలకు (Kids) కనీస సౌకర్యాలు కల్పించలేమనే ఆందోళనతోనే నేటి తరం దంపతులు ‘డింక్’ జీవనశైలి వైపు మొగ్గు చూపుతున్నారని హర్ష్ గుప్తా తన పోస్ట్‌లో పేర్కొన్నారు. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు వారి ఆలోచన బాధ్యతాయుతమైనదని అంటుంటే, మరికొందరు సిటీ లైఫ్ కష్టాలకు నిదర్శనమని కామెంట్ చేస్తున్నారు.

