కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy)లోని ఎంఎన్ఆర్ మెడికల్ కళాశాలలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సంగారెడ్డి జిల్లా అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి (ASP Chaitanya Reddy) ఆధ్వర్యంలో మహిళా, బాలల చట్టాలు, మాదక ద్రవ్యల దుర్వినియోగం పై అవగాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి మాట్లాడుతూ విద్యార్థినులు తమ హక్కులు, చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండటం ఎంతో అవసరమన్నారు. ముఖ్యంగా పోక్సో చట్టం, బాల్య వివాహ నిషేధ చట్టం వంటి అంశాలపై ప్రతి విద్యార్థి అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.
విద్యార్థినులు వేధింపులు, అనుచిత సంఘటనలు ఎదురైనా భయపడకుండా వెంటనే తల్లిదండ్రులు, లెక్చరర్లు లేదా పోలీసులను సంప్రదించాలని కోరారు. చిన్నారులపై లైంగిక వేధింపులు, దాడులు వంటి నేరాల నుంచి రక్షణ కల్పించేందుకు పోక్సో చట్టం అమల్లో ఉందని వివరించారు. బాల్య వివాహం చట్టరీత్యా నేరమని, అలాంటి ఘటనలు తెలిసినా సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. లింగ వివక్షతపై మాట్లాడుతూ, అమ్మాయిలు, అబ్బాయిలకు సమాన హక్కులు ఉన్నాయని, విద్య, ఉద్యోగం, అవకాశాలు, గౌరవం విషయంలో ఎటువంటి తేడా ఉండకూడదని పేర్కొన్నారు. వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితో పంచుకోవద్దని, సోషల్ మీడియా వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

