రుణమాఫీ కానీ రైతుల పక్షానా హరీశ్ రావు న్యాయ పోరాటం

కలం, మెదక్ బ్యూరో : సిద్దిపేట నియోజకవర్గ పరిధిలో రుణమాఫీ కానీ రైతుల పక్షాన ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) న్యాయ పోరాటానికి సిద్దమయ్యారు. అన్యాయానికి గురైన రైతుల కోసం తాను హైకోర్టులో రిట్ పిటిషన్ (Writ Petition) దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో సిద్దిపేట నియోజకవర్గంలో 43,363 మంది రైతులు రుణ మాఫీకి అర్హులైన వారు ఉన్నారని, కానీ 20,514 మంది మాత్రమే ప్రభుత్వం రుణమాఫీ ప్రయోజనం పొందారని పేర్కొన్నారు. ఇంకా రుణమాఫీ కోసం 22,849 మంది రైతులు ఎదురుచూస్తున్నారని 47 శాతం రైతులు మాత్రమే రుణమాఫీ పొందారని వెల్లడించారు.

హైకోర్టులో హరీశ్ రావు రిట్ పిటిషన్..

సిద్దిపేట నియోజకవర్గంలోని వేలాది మంది రైతుల కష్టాలను పరిగణనలోకి తీసుకుని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 కింద హైకోర్టును ఆశ్రయించానని హరీశ్ రావు పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులను కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. రైతుల ఖాతాల్లో వెంటనే రుణమాఫీ సొమ్మును జమ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, అర్హులైన 22,849 మంది రైతుల ఖాతాల్లో రుణమాఫీ నిధులను జమ చేయాలని, బ్యాంకుల నుండి రైతులను కాపాడాలని డిమాండ్ చేశారు. హైకోర్టు ద్వారా తమ రైతులకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందనీ విశ్వాసం వ్యక్తం చేశారు. హరీశ్ రావు తరఫున న్యాయవాది ఆర్. చంద్రశేఖర్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు.

మాట తప్పిన రేవంత్ రెడ్డి : హరీశ్ రావు

రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించి, ఆ పైన ఉన్న అప్పులను రైతులు చెల్లిస్తేనే మాఫీ వర్తిస్తుందని షరతు విధించిందని హరీశ్ రావు విమర్శించారు. ఈ మాట నమ్మి, ఎంతోమంది రైతులు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు తెచ్చి మరీ ఆ అదనపు మొత్తాన్ని చెల్లించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మాఫీ చేస్తుందని ఆశపడితే, ఇంతవరకు నిధులు విడుదల చేయకుండా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివల్ల బ్యాంకుల నుండి రైతులపై ఒత్తిడి, వడ్డీల భారం పెరిగిపోయి మానసిక వేదనకు గురవుతున్నారని హరీశ్ ఆవేదన వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>