కలం, కరీంనగర్: కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు గుర్రం నర్సాగౌడ్ (Gurram Narsa Goud) జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. కరీంనగర్‌లోని తన క్యాంపు కార్యాలయంలో చొప్పదండి ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షులు డాక్టర్ మేడిపల్లి సత్యం ఆయనకు సోమవారం నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. గత 30 సంవత్సరాలుగా ఎలాంటి పదవులు ఆశించకుండా కాంగ్రెస్ పార్టీ కోసం నిస్వార్థంగా సేవలు అందిస్తున్న గుర్రం నర్సాగౌడ్ చిత్తశుద్ధి, నిబద్ధతలను గుర్తించే ఈ బాధ్యతను అప్పగించినట్లు తెలిపారు. పార్టీ కష్టకాలంలో జెండా మోసిన ప్రతీ కార్యకర్తకూ కాంగ్రెస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు.
గంగాధర మండలంతో పాటు చొప్పదండి నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నర్సాగౌడ్ కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా గుర్రం నర్సాగౌడ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ కీలక బాధ్యతను అప్పగించిన డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, రాష్ట్ర మంత్రులకు, జిల్లా కాంగ్రెస్ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అధిష్టానం ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తానని పేర్కొన్నారు.

