కలం, నిజామాబాద్ బ్యూరో: నిరుపేదల సొంతింటి కల ఇందిరమ్మ ఇళ్లు.. నిజామాబాద్ జిల్లాలో పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లల్లో పండుగను పురస్కరించుకుని ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ (Maa Indiramma Intlo Deepawali)కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలి అని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Ila Tripathi) అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం ఈ కార్యక్రమం అమలు ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ త్రిపాఠి సమావేశమై సూచనలు చేశారు. లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి దివ్వెలు వెలిగించి, ప్రత్యేక సంబురాలు నిర్వహించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
తొలి దీపావళి వేడుకను ఆనందోత్సాహంతో జరుపుకునేలా ఈ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలన్నారు. లబ్ధిదారులు, ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములు అయ్యేలా, పేదల సొంత ఇంటి కలను సాకారం చేస్తున్న ప్రభుత్వ సంకల్పాన్ని ప్రతిబింబించేలా మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ భుజంగరావు, ఇంచార్జి హౌసింగ్ పీ.డీ గీత, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, డీఆర్డీఓ సాయన్న, ఎం.ఎస్.ఓలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

