కలం, దేవరకొండ : కృష్ణానీళ్ల వినియోగానికి సంబంధించి ఎదుల నుంచి డిండికి నీళ్లు తెస్తామని ప్రభుత్వం చెబుతోందని, అయితే అది అంత సులువు కాదని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) తేల్చిచెప్పారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా పర్యటనలో భాగంగా దేవరకొండ నియోజకవర్గంలోని డిండి రిజర్వాయర్‌ను (Dindi Reservoir) తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సందర్శించారు. ఈ సందర్భంగా డిండి ఎత్తిపోతల పథకానికి ప్రత్యామ్నాయ నీటి వనరులపై ఆమె ఒక స్పష్టమైన ప్రెజెంటేషన్ ఇచ్చారు.
గోదావరి – కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యలకు ఏకైక శాశ్వత పరిష్కారమని ఆమె స్పష్టం చేశారు. అసలు శ్రీశైలం నుంచి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకే 2 టీఎంసీల నీళ్లు తీసుకోలేని పరిస్థితి ఉందన్నారు. ఎల్లూరు పంపుహౌస్‌ను ఓపెన్ కట్ నుంచి అండర్ గ్రౌండ్ గా మార్చడంతో సమస్య వచ్చిందని, శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకునే లెవల్ 800 అడుగుల నుంచి 820 అడుగులకు పెరిగిందని వివరించారు. ఎల్లూరులో చేపట్టిన బ్లాస్టింగ్స్ వల్ల కల్వకుర్తి పంపుహౌస్‌లో ఒక పంపు పేలిపోయిందని, ఏళ్లు గడిచినా దాన్ని రీస్టోర్ చేయలేదని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎదుల నుంచి డిండి(Dindi Reservoir)కి లింక్ చేస్తామనడం కేవలం రెండు జిల్లాల ప్రజల మధ్య తగువులు పెట్టించడమేనని ఆరోపించారు.
గోదావరి జలాల మళ్లింపుతోనే శాశ్వత పరిష్కారం
కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project)లో భాగంగా బస్వాపూర్ రిజర్వాయర్ ఇప్పటికే 80 శాతం పూర్తయిందని కవిత గుర్తుచేశారు. మల్లన్న సాగర్ నుంచి గోదావరి నీటిని బస్వాపూర్ మీదుగా డిండి ఎత్తిపోతలకు ఇవ్వడమే శాశ్వత పరిష్కారమని తెలిపారు. బస్వాపూర్ నుంచి ఉల్పరకు కేవలం 110 కిలోమీటర్ల దూరమే ఉందని, స్పీడ్‌గా పనిచేస్తే రోజుల వ్యవధిలోనే ఈ పనిని పూర్తి చేయవచ్చని చెప్పారు. గోదావరి నీళ్లను తీసుకురాకపోతే డిండికి సాగునీరు రాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 80 శాతం పూర్తయిన ప్రాజెక్ట్ లను పూర్తి చేయకుండా ముఖ్యమంత్రి నిర్లక్ష్యం చేస్తున్నారని కవిత మండిపడ్డారు.
ఈ ప్రభుత్వం వచ్చి మూడేళ్లవుతున్నా డిండి ఎత్తిపోతలకు సరైన సోర్స్ పాయింట్ చూపించలేకపోయిందని విమర్శించారు. ఈ ముఖ్యమంత్రి రేసుగుర్రం అనుకుంటే కీలుగుర్రంగా మారిపోయాడని ఎద్దేవా చేశారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉండాల్సిన బీఆర్ఎస్ నాన్-పర్ఫార్మింగ్ అసెట్‌లా మారిపోయిందని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజల తరఫున పరిష్కారాలు చూపుతోంది తమ పార్టీ మాత్రమేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో రానున్న రోజుల్లో కరువు పరిస్థితులు భయంకరంగా ఉండే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
పంటలు వేయవద్దని చెప్పిన ప్రభుత్వం, నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరానికి రూ. 25 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తుపాకుల గూడెం వద్దే గోదావరి – కావేరి అనుసంధానం జరిగేలా చూడాలని, నాగార్జున సాగర్ పరిధిలోని పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని కోరారు. ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతూ ప్రత్యామ్నాయ మార్గాలను చూపుతున్న తమ పార్టీ అభ్యర్థులను రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
Also Read : దీపాల వెలుగుల్లో అయోధ్య.. సరయూ నది తీరాన దీపోత్సవ్
Follow Us On: Instagram

