కలం, వెబ్ డెస్క్ : అంతర్జాతీయ క్రికెట్‌లో మంచి ఆరంభం చేసిన భారత యువ పేసర్ గుర్నూర్ బ్రార్ (Gurnoor Brar) తన ప్రదర్శనను ఇంకా మెరుగుపరచాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలిపాడు. దేశవాళీ క్రికెట్‌తో పాటు ఇండియా-ఏ(India A) జట్టులో నేర్చుకున్న పాఠాలే తన ఎదుగుదలకు బలమని ఆయన పేర్కొన్నారు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన గుర్నూర్, భారత్ 170 పరుగుల తేడాతో గెలవడంలో తన వంతు సహకారం అందించాడు.
రంజీ ట్రోఫీలో ఎలా బౌలింగ్ చేశానో, అదే విధానాన్ని ఇండియా-ఏలో కూడా కొనసాగించానని తెలిపారు. వేగం, సరైన లెంగ్త్, స్వింగ్‌పైనే తన నమ్మకం ఉందని చెప్పారు. ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడినప్పటికీ, ఇంకా మెరుగ్గా రాణించే సామర్థ్యం తనలో ఉందని గుర్నూర్ విశ్వాసం వ్యక్తం చేశాడు. జట్టు యాజమాన్యం, బౌలింగ్ కోచ్ నుంచి పూర్తి మద్దతు లభిస్తోందని, అది తన ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని పేర్కొన్నారు.
ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్‌తో (Gujarat Titans) గడిపిన సమయం కూడా తనకు ఎంతో ఉపయోగపడిందని చెప్పారు. ఆ సమయంలో ఆశిష్ నెహ్రా, కగిసో రబడా, మహ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ వంటి అనుభవజ్ఞుల నుంచి ఎంతో నేర్చుకున్నానని వెల్లడించాడు. వైట్‌బాల్ క్రికెట్‌లో కేవలం వేగం మాత్రమే సరిపోదని, పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు మార్చుకోవడం అవసరమని గుర్నూర్ అభిప్రాయపడ్డాడు. తన ప్రదర్శనపై సంతృప్తి ఉన్నప్పటికీ, టీమ్ ఇండియాకు ఇంకా ఎక్కువ సేవ చేయాలన్నదే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశాడు.

