అదరగొట్టిన గుజరాత్.. ఎస్ఆర్‌హెచ్ టార్గెట్ 169

కలం, వెబ్ డెస్క్: అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న పోరులో గుజరాత్ టైటాన్స్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఓపెనర్ సాయి సుదర్శన్ క్లాస్ ఇన్నింగ్స్‌కు తోడు, చివర్లో వాషింగ్టన్ సుందర్ మెరుపులు మెరిపించడంతో గుజరాత్ ఇన్నింగ్స్ నిలబడింది. ఆరంభంలోనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును ఈ ఇద్దరే ఆదుకున్నారు.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (5), స్టార్ ప్లేయర్ జోస్ బట్లర్ (7) తక్కువ పరుగులకే వెనుదిరిగి నిరాశపరిచారు. ఈ దశలో వన్ డౌన్ బ్యాటర్ నిశాంత్ సింధు (22) కాసేపు మెరిసినా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. అయితే ఒకవైపు వికెట్లు పడుతున్నా సాయి సుదర్శన్ మాత్రం పట్టుదలతో ఆడాడు. 44 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 61 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు.

సుదర్శన్ అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్ అసలు సిసలు ప్రతాపం చూపాడు. సన్‌రైజర్స్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి కేవలం 33 బంతుల్లోనే 7 ఫోర్లు, ఒక సిక్సర్‌తో అర్ధ సెంచరీ (50) పూర్తి చేసుకున్నాడు. ఆఖర్లో రాహుల్ తెవాటియా కేవలం ఒక్క బంతి ఎదుర్కొని ఫోర్ కొట్టడంతో గుజరాత్ స్కోరు 168కి చేరింది.

హైదరాబాద్ బౌలర్లలో ప్రఫుల్ హింగే పొదుపుగా బౌలింగ్ చేస్తూ 17 పరుగులే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. సాకిబ్ హుస్సేన్ కూడా 2 వికెట్లు తీసినప్పటికీ పరుగులు ధారాళంగా ఇచ్చాడు. స్టార్ బౌలర్ పాట్ కమిన్స్ ఒక వికెట్ సాధించగా, ఈశాన్ మలింగ 4 ఓవర్లలో ఏకంగా 46 పరుగులు సమర్పించుకొని భారీగా ఖర్చయ్యాడు. మరి 169 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ బ్యాటర్లు ఎలా ఛేదిస్తారో చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>