కలం, నల్లగొండ బ్యూరో : ఏండ్ల తరబడి జెండా మోసిన సీనియర్లు ఒకవైపు.. పార్టీలోకి కొత్తగా వచ్చి జిల్లా పగ్గాలు చేపట్టిన వారి పెత్తనం మరోవైపు. వెరసి నల్లగొండ బీజేపీ(Nalgonda BJP)లో ఇప్పుడు నిఖార్సైన కార్యకర్త నలిగిపోతున్నాడు. జిల్లా బీజేపీలో అధిపత్య పోరు పతాక స్థాయికి చేరింది. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే కాషాయ పార్టీలో ఇప్పుడు గ్రూపు రాజకీయాల కుమ్ములాటలు వీధికెక్కాయి. జిల్లా రథసారథి అనుసరిస్తున్న మొండి వైఖరి.. సీనియర్లను విస్మరించడం.. సొంత పార్టీ అభ్యర్థులనే ఓడించేలా సాగుతున్న లోపాయికారి ఒప్పందాలు చూస్తుంటే.. శత్రువు ఎక్కడో లేడు.. పార్టీ లోపలే ఉన్నాడనే విమర్శలు కార్యకర్తల నుంచి బలంగా వినిపిస్తున్నాయి.
పార్టీ నిధులు పక్కదారి
ప్రధానంగా కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ నిధులను పక్కదారి పట్టించడం.. బలమైన నేతలను తొక్కేయడం వంటి అంశాలు ఇప్పుడు అధిష్టానం వేసిన ‘నిజనిర్ధారణ కమిటీ’ విచారణలో సంచలన నిజాలుగా బయటపడుతున్నాయి. ఈ అంతర్గత కలహం కమలనాథులను ఎటు తీసుకెళ్తోంది? ఒకప్పుడు జిల్లాలో తిరుగులేని శక్తిగా ఎదగాలని కలలుగన్న బీజేపీ నేతలకు, ఇప్పుడు సొంత జిల్లా నాయకత్వమే శాపంగా మారిందా? నూకల నరసింహారెడ్డి, బండారు ప్రసాద్ వంటి సీనియర్లను దూరం పెట్టి, జూనియర్లకు పెద్దపీట వేయడం వెనుక ఉన్న అసలు రహస్యమేమిటి? పిల్లి రామరాజు వంటి నాయకుల ఎదుగుదలను అడ్డుకోవడానికి జిల్లా రథసారథి ఆడిన ‘చదరంగం’లో పార్టీ బలైపోయిందా? తాజాగా రాజాసింగ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో జిల్లాలో నాయకత్వ మార్పు అనివార్యమా? అన్న ప్రశ్నలు లేకపోలేదు.
సీనియర్ల విస్మరణ.. జూనియర్ల పెత్తనం
నల్లగొండ జిల్లాలో దశాబ్దాలుగా పార్టీ సిద్ధాంతాలను నమ్మి, జెండా మోసిన సీనియర్ నాయకులను పక్కన పెట్టడం ఇక్కడ ప్రధాన చర్చనీయాంశంగా మారింది. నూకల నరసింహారెడ్డి, బండారు ప్రసాద్, మాధగాని శ్రీనివాస్ గౌడ్, వీరెల్లి చంద్రశేఖర్, పోతేపాక సాంబయ్య వంటి సీనియర్లు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం కేవలం యాదృచ్చికం కాదు.. అది నాయకత్వంపై వారి నిరసనగా కనిపిస్తోంది. నాయకత్వ లోపం వల్ల పార్టీ క్రమశిక్షణ తప్పి జిల్లా కార్యాలయంలోనే బిసి నాయకులపై భౌతిక దాడులు జరిగే స్థాయికి చేరడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తోంది.
మున్సిపల్ ఎన్నికల్లో ఘోర ఓటమికి కారణం ఏమిటి?
నల్లగొండ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి జిల్లా నాయకత్వమే కారణమనే విమర్శ బలంగా ఉంది. పిల్లి రామరాజు వంటి ఇతర పార్టీల నుంచి వచ్చిన బలమైన నేతలను ప్రోత్సహించాల్సింది పోయి.. వారి ఎదుగుదలను అడ్డుకోవడం కోసం జిల్లా రథసారథి తన సొంత సామాజిక వర్గానికి, బంధువులకు ప్రాధాన్యత ఇచ్చారనే ఆరోపణలున్నాయి. ప్రధానంగా పిల్లి రామరాజు పోటీ చేసిన చోట కాంగ్రెస్‌కు పరోక్షంగా సహకరించడం.. పార్టీ ఫండ్‌ను అభ్యర్థులకు అందకుండా చేసి తన సోదరుడి కోసం వాడుకోవడం వంటివి నమ్మకద్రోహం కిందకే వస్తాయని కార్యకర్తలు మండిపడుతున్నారు.
ప్రత్యర్థి పార్టీలతో కుమ్మక్కవుతున్నారా?
రాజకీయాల్లో నిధుల నిర్వహణ చాలా కీలకం. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అధిష్టానం పంపిన నిధులను స్వప్రయోజనాలకు వాడుకున్నారనే విమర్శలు నిజమైతే.. అది పార్టీ నైతికతనే ప్రశ్నిస్తుంది. ప్రత్యర్థి పార్టీలతో కుమ్మక్కై.. సొంత పార్టీ అభ్యర్థులనే ఓడించే లోపాయికారి ఒప్పందాలు నల్లగొండ జిల్లాలో కమలం వాడిపోవడానికి ప్రధాన కారణాలని చెప్పాలి.
అధిష్ఠానం ఫోకస్ పెడుతుందా?
ఈ గందరగోళంపై రాష్ట్ర అధిష్ఠానం ఇప్పటికే దృష్టి సారించి.. నిజనిర్ధారణ కమిటీని వేయడం జిల్లా నాయకత్వానికి గట్టి వార్నింగే. కమిటీ విచారణలో వాస్తవాలు నిగ్గు తేలడం.. బాధ్యులపై చర్యలు తీసుకోవడం పార్టీ భవిష్యత్తుకు అత్యవసరం. ఇటీవల ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు జిల్లా నాయకులకు చెంపపెట్టులా మారాయి. ఇతర రాష్ట్రాల్లో గెలుపు చూసి ఇక్కడ సంబరాలు చేసుకోవడం కాదు.. తెలంగాణ గడ్డపై జెండా ఎగురవేయాలని ఆయన ఇచ్చిన పిలుపు నల్లగొండ జిల్లా నాయకత్వ మార్పు ఆవశ్యకతను నొక్కి చెబుతోంది.
పూర్వవైభవం వచ్చేనా?
నల్లగొండలో బీజేపీ మళ్లీ పుంజుకోవాలంటే.. కరుడుగట్టిన కాషాయవాదులను, సీనియర్లను గౌరవించే నాయకత్వం రావాలి. గ్రూపు రాజకీయాలకు స్వస్తి పలికి కేవలం తన వర్గానికి మాత్రమే కాకుండా పార్టీ కోసం పనిచేసే వారందరినీ కలుపుకుపోయే సమర్థవంతమైన రథసారథి జిల్లా బీజేపీకి అవసరం. లేనిపక్షంలో కేడర్ ఉన్నా లీడర్ లేక నీలగిరి గడ్డపై కమలం వికసించడం అసాధ్యమే అవుతుంది.

