కలం, వెబ్ డెస్క్ : దేశభక్తి, జాతీయ సమగ్రత పెంపొందించడమే జనసేన లక్ష్యం అని మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) అన్నారు. సోమవారం ‘జాతీయ సమగ్రతకు సేన ప్రస్థానం’ పేరిట ఢిల్లీలో జనసేన సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా నాదెండ్ల మీడియాతో మాట్లాడారు. జాతీయ సమైక్యతను చాటి చెబుతూ, దేశవ్యాప్తంగా ఈ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే సమావేశం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. ఈ సమావేశంలో వికసిత్ భారత్ సాధన, నేషన్ ఫస్ట్, కూటమి రెండేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం, జనసేన పార్టీ 12 ఏళ్ల ప్రస్థానం, రాజకీయాల్లో జెన్ జీ పాత్ర అనే ఐదు అంశాలపై చర్చించామని ఆయన వెల్లడించారు. సాధారణంగా రాజకీయ పార్టీలు పదవులు కోసమో, సమస్యలపై ఆందోళనలు చేయడం కోసమే దేశ రాజధాని ఢిల్లీకి వస్తుంటాయన్నారు. కానీ జనసేన అందుకు పూర్తి భిన్నంగా అడుగులు వేస్తోందని చెప్పారు.
దేశ చరిత్రలోనే మొట్ట మొదటిసారిగా, ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు ఆశించకుండా కేవలం ప్రతి పౌరుడిలో బాధ్యతను, దేశభక్తిని పెంపొందించే ఏకైక లక్ష్యంతోనే ‘జాతీయ సమగ్రతకు సేన ప్రస్థానం’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ఢిల్లీలో చేపట్టినట్లు స్పష్టం చేశారు. స్వార్థ రాజకీయాలకు అతీతంగా, జాతీయ సమైక్యతను చాటిచెప్పడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. జనసేన పార్టీ రిజిస్టర్డ్ పార్టీ నుండి రికగ్నైజ్డ్ పార్టీగా ఎదగడం వెనుక చాలా మంది కృషి ఉందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీలు వల్లభనేని బాలశౌరి, తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, ఏపీ టిడ్కో ఛైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ పాల్గొన్నారు.

