కలం, కరీంనగర్ బ్యూరో: తెలంగాణ ప్రజల సంక్షేమం, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ‘తెలంగాణ జనతా పార్టీ’ (Telangana Janata Party) ఆవిర్భవించినట్లు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కూతాడి శివరాజ్ ప్రకటించారు. కరీంనగర్ లో పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు గడిచినా నేటికీ అనేక కుటుంబాలు నిరుద్యోగం, పేదరికం, రైతు సమస్యలు, నాణ్యమైన విద్య వైద్యం వంటి ప్రాథమిక అవసరాల కోసం పోరాడుతున్నాయని, ఈ పరిస్థితిని మార్చాలనే సంకల్పంతోనే పార్టీని స్థాపించినట్లు పేర్కొన్నారు.
అధికారం కోసం కాకుండా ప్రజా సేవనే ధ్యేయంగా ముందుకు వస్తున్నామని, ప్రతి కుటుంబానికి అండగా, ప్రతి రైతుకు భరోసాగా, యువతకు అవకాశంగా, మహిళలకు రక్షణగా, కార్మికులకు న్యాయంగా నిలబడటమే తమ బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రతి పౌరుడికి సమాన గౌరవం, అవకాశాలు కల్పించడం, రైతులకు గిట్టుబాటు ధర, సాగునీరు ప్రభుత్వ అండ అందించడం, యువతకు ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాలు పెంచడం, మహిళల భద్రత, ఆర్థిక స్వావలంబనకు ప్రాధాన్యత ఇవ్వడమే తమ లక్ష్యం అన్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణ, సామాజిక భద్రత కల్పించడం, ప్రభుత్వ విద్య, వైద్య సేవలను బలోపేతం చేయడం కోసం ముందుకెళ్తామన్నారు.
గ్రామం నుండి నగరం వరకు అవినీతి రహిత, పారదర్శక, జవాబుదారీతనంతో కూడిన పాలనతో సమాన అభివృద్ధి సాధించే దిశగా పయనిస్తామన్నారు. తెలంగాణ జనతా పార్టీ (Telangana Janata Party)లో పలు ప్రజా సంఘాలు విలీనమయ్యాయని ప్రతినిధులు తెలిపారు. తెలంగాణ దళిత బహుజన వర్గాల సమాఖ్య, క్రాంతి యువజన సంక్షేమ సంఘం, ఎస్సీ, ఎస్టీ కులాల ఐక్య వేదిక, తెలంగాణ ఉద్యమకారుల ఐక్య ఫోరం, తెలంగాణ మహిళా సమాఖ్య లు విలీనమయ్యాయని తెలిపారు.
ప్రజలే యజమానులని, నాయకులు సేవకులని నమ్ముతూ ప్రతి నిర్ణయంలో ప్రజా అభిప్రాయాన్ని గౌరవిస్తామని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సమావేశంలో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కూతాడి శివరాజ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారకూరి శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మొగురం మీరియా, రాష్ట్ర అధికార ప్రతినిధి కాతిపాక అజయ్ ఉన్నారు.
Read Also: డేటింగ్ యాప్స్‌తో డేంజర్.. యువతకు గైనకాలజిస్ట్ హెచ్చరిక!
Follow Us On : WhatsApp

