కలం, వెబ్డెస్క్: Grameena Upadi Hami | గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఏటా 100 పనిదినాలు కల్పించి, వారి జీవనానికి భరోసా ఇవ్వాలని, వలసలు నివారించాలని కేంద్ర ప్రభుత్వం 20 ఏళ్ల కిందట మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ (MGNREGS) పథకం తెచ్చింది. దీనికోసం ఏటా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. కానీ, ఈ పథకం అమలు రాను రాను తీసికట్టుగా తయారవుతోంది. దీనికి నిదర్శనం శుక్రవారం కేంద్రం లోక్సభలో వెల్లడించిన వివరాలే.
దేశవ్యాప్తంగా గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో ఎన్ని పని దినాలు కల్పించారు? ఎంత మందికి ఉపాధి ఇచ్చారు? అంటూ ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్రం ఇచ్చిన సమాధానం.. ఉపాధి హామీ పథకం (Grameena Upadi Hami Scheme) అమలు ఎంత దారుణంగా ఉందో బయటపెట్టింది. దీని ప్రకారం 2020–21 నుంచి 2024–25 మధ్య ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కల్పించిన పనిదినాలు గమనిస్తే తెలుగు రాష్ట్రాల్లో ఉపాధి రోజులు సగమే ఉన్నట్లు తేలింది. తెలంగాణలో అయితే గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో సగటున 50రోజులు కూడా పని కల్పించలేదు.
తెలుగు రాష్ట్రాల్లో సగం రోజులే..
ఆంధ్రప్రదేశ్లో గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో సగటున కల్పించిన పని దినాలు వరుసగా 54.41, 51.66, 52.27, 54.89, 51.62. అలాగే తెలంగాణలో పని కల్పించిన సగటు రోజులు వరుసగా 50.77, 50.31, 44.56, 47.72, 45.82. కాగా, పనిదినాల దినాల కల్పించడంలో జాతీయ సగటు సైతం సగానికి మించకపోవడం ఈ పథకం అమలు తీరు ఎంత దారుణంగా ఉందో తెలియజేస్తోంది. కాగా, మొత్తం మీద ఏటా 90కి పైగా పని దినాలు ఇస్తూ ఈశ్యాన్య రాష్ట్రమైన మిజోరం అగ్రస్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో త్రిపుర, మేఘాలయ, కేరళ ఉన్నాయి. ఈ గణాంకాలు గమనిస్తే పేదలకు భరోసాగా ఉండాల్సిన ఉపాధి హామీ పథకం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఏ పరిస్థితికి చేరిందో అర్థమవుతుంది.
Read Also: ఫుట్‌బాల్ దిగ్గజానికి అరుదైన గౌరవం.. కోల్‌కతాలో మెస్సీ భారీ విగ్రహం
Follow Us On: Youtube


