కలం, మెదక్ బ్యూరో : విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది ప్రభుత్వ పాఠశాలలేనని, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలల్లోనే చేరి నాణ్యమైన విద్యను అభ్యసించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి (MLA Kotha Prabhakar Reddy) అన్నారు. మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం, మౌలిక సదుపాయాలు, పరిశుభ్రమైన తరగతి గదులు, తాగునీరు, మరుగుదొడ్లు, డిజిటల్ విద్య వంటి అన్ని సౌకర్యాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం అవసరమైన సదుపాయాల కల్పనకు తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల బాధ్యతతో వ్యవహరించాలని, బోధనలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకూడదని సూచించారు. ప్రతి విద్యార్థి విద్యా ప్రమాణాలు మెరుగుపడేలా కృషి చేయాలని, విద్యార్థులను క్రమశిక్షణతో పాటు విలువలతో కూడిన విద్య వైపు నడిపించాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి (Kotha Prabhakar Reddy) కోరారు.
Read Also: పిల్లల భద్రతే ముఖ్యం.. ప్రతి పేరెంట్ తప్పక చెప్పాల్సిన సేఫ్టీ రూల్స్
Follow Us On: X(Twitter)

