Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణ యూనివర్సిటీలు దేశంలోనే బెస్ట్ ర్యాంకులు సాధించాలి: గవర్నర్

కలం, వెబ్ డెస్క్: విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల నైపుణ్యాల పెంపుదల, నిరంతర అభివృద్ధిపై వైస్ ఛాన్స్‌లర్స్ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా (Shiv Pratap Shukla) అన్నారు. లోక్ భవన్‌లో గురువారం రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, ఉన్నత విద్యా అధికారులతో గవర్నర్ సమావేశం నిర్వహించారు. ఉన్నత విద్యలో గతేడాది కాలంలో అమలుచేస్తున్న సంస్కరణలు, కొత్త కోర్సులు, పరిశోధన, నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలను చైర్మన్ బాల కిష్టారెడ్డి గవర్నర్‌కు వివరించారు. అనంతరం గవర్నర్ శివప్రతాప్ శుక్లా వైస్ ఛాన్సలర్లనుద్దేశించి మాట్లాడారు. ఉస్మానియా, కాకతీయ, జేఎన్‌టీయూ వంటి విశ్వవిద్యాలయాల కృషిని గవర్నర్ ప్రశంసించారు. యూనివర్సిటీలు అంటే డిగ్రీలు ప్రదానం చేసే సంస్థలుగా మాత్రమే ఉండకుండా, ఉపాధి అవకాశాలు కల్పించే విద్యా వ్యవస్థగా అభివృద్ధి చేయాలని గవర్నర్ అన్నారు. ఉత్తమ అధ్యాపకుల నియామకం, శిక్షణ, నిరంతర అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.

పరిశ్రమలతో సమన్వయం చేసుకుంటూ ఆచరణాత్మక పరిష్కారాలు, పరిశోధన, ఆవిష్కరణలు ప్రోత్సహించాలన్నారు. యువతను స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దడానికి నైపుణ్యాభివృద్ధి, ఉపాధి ఆధారిత విద్యకు, నూతన విద్యా విధానం అమలుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. తెలంగాణ యూనివర్సిటీలు మంచి పనితీరు కనబరుస్తూ దేశంలోనే బెస్ట్ యూనివర్సిటీ ర్యాంకింగ్‌లో టాప్‌లో ఉండాలన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన ‘స్టార్టప్ ఇండియా’, ‘స్కిల్ ఇండియా’, ‘డిజిటల్ ఇండియా’ లాంటివి యువత సాధికారతకు దోహదం చేస్తున్నాయని గవర్నర్ పేర్కొన్నారు. ‘రాష్ట్రీయ ఉన్నత శిక్షా అభియాన్’, ‘ప్రధానమంత్రి పరిశోధన ఫెలోషిప్’ వంటి పథకాలు ఉన్నత విద్యలో కొత్త ఊపునిస్తున్నాయన్నారు. ఫారిన్ యూనివర్సిటీలు మన యూనివర్సిటీల (Universities) కంటే గొప్పవేమి కాదన్నారు. మనదేశ యూనివర్సిటీ లలో విద్యను అభ్యసించిన ఇంజనీర్లు డాక్టర్లు తమ పనితీరుతో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారని గుర్తుచేశారు.

వైస్ ఛాన్స్‌లర్లు కేవలం నిర్వాహకులుగానే కాకుండా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే నాయకులు అని గవర్నర్ (Shiv Pratap Shukla) అభివర్ణించారు. తెలంగాణను విద్య, పరిశోధన, ఆవిష్కరణలలో అగ్రగామిగా నిలపడానికి అందరూ అంకితభావంతో కలిసి చేయాలన్నారు. అనంతరం రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఇటీవల ప్రవేశపెట్టిన విద్యాసంస్కరణలతో కూడిన “ఫ్రమ్ విజన్ టు ఇంపాక్ట్: TGCHE రీసెంట్ హయ్యర్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్” పుస్తకాన్ని గవర్నర్ ఆవిష్కరించారు.

Read Also: గల్ఫ్ కార్మికులపై యుద్ధం ఎఫెక్ట్.. విమాన చార్జీలకు రెక్కలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>