కలం, వెబ్ డెస్క్: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు కోసం టీవీకే చీఫ్ విజయ్ (Vijay) ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆయన ప్రయత్నాలకు ఎక్కడికక్కడ ఆటంకాలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తమకు అవకాశం ఇవ్వాలని.. అసెంబ్లీలో బలనిరూపణ చేసుకుంటామని టీవీకే నేతలు చెబుతున్నారు. అయితే పూర్తిస్థాయిలో ఎమ్మెల్యేల మద్దతు ఉంటేనే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇస్తానని గవర్నర్ కార్యాలయం స్పష్టం చేసింది. 118 మంది ఎమ్మెల్యేల సంతకాలు తీసుకొని వస్తేనే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇస్తామని గవర్నర్ చెబుతున్నారు.
గవర్నర్‌తో విజయ్ భేటీ
గురువారం టీవీకే చీఫ్ విజయ్.. గవర్నర్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ భేటీ తర్వాత కూడా ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియ ఓ కొలిక్కి రాలేదు. ప్రస్తుతం టీవీకేకు 108 సీట్లు ఉండగా, కాంగ్రెస్ మద్దతుతో ఆ సంఖ్య 113కు చేరుతోంది. అయితే మెజార్టీకి అవసరమైన 118 మార్క్‌కు ఇంకా ఐదు మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరమవుతోంది. దీనిపై విజయ్ స్పందిస్తూ తాను ఫ్లోర్ టెస్ట్‌కు సిద్ధమని గవర్నర్‌కు తెలిపినట్లు తెలుస్తోంది.
కోర్టుకు వెళ్లనున్న టీవీకే
ఒకవేళ గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వకపోతే టీవీకే చీఫ్ విజయ్ (Vijay) కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. టీవీకేకు కాంగ్రెస్ షరతులతో కూడిన మద్దతు ప్రకటించింది. బీజేపీ వంటి పార్టీలతో పొత్తు పెట్టుకోకూడదనే షరతు విధించినట్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా సీపీఐ, సీపీఎం, వీసీకే, పట్టాళి మక్కల్ కచ్చి (పీఎంకే) పార్టీల మద్దతు లభిస్తే విజయ్ కూటమి బలం 123కు చేరే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే వీసీకే ప్రస్తుతం డీఎంకే కూటమిలో ఉండటం, పీఎంకే బీజేపీతో కలిసి ఉండటం వల్ల రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి.
రిసార్ట్‌లో టీవీకే ఎమ్మెల్యేలు !
మరోవైపు టీవీకే-ఏఐఏడీఎంకే పొత్తు పెట్టుకోబోతున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ఏఐఏడీఎంకేలోని కొందరు ఎమ్మెల్యేలు టీవీకేకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ పార్టీ నేతలు మాత్రం అలాంటి ప్రచారాన్ని ఖండించారు. ఈ రాజకీయ పరిణామాల మధ్య విజయ్ తన ఎమ్మెల్యేలను చెన్నై సమీపంలోని మామల్లపురంలోని ఓ రిసార్ట్‌లో ఉంచినట్లు సమాచారం. ప్రభుత్వం ఏర్పాటు దిశగా టీవీకే తీవ్రంగా ప్రయత్నాలు కొనసాగిస్తోంది.

