Mobile Popup Ad
Mobile Popup Ad

కరీంనగర్‌లో రైతుల రాస్తారోకో

కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ (Karimnagar) జిల్లా గంగాధర మండలంలో రైతులు రాస్తారోకో నిర్వహించడంతో కరీంనగర్–జగిత్యాల ప్రధాన జాతీయ రహదారిపై గురువారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వెంకటాయపల్లి (Venkatayapalli) స్టేజి వద్ద పెద్ద సంఖ్యలో రైతులు రోడ్డుపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. వరి ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం, తూకాల్లో అక్రమాలు జరుగుతున్నాయని, కొనుగోలు కేంద్రాల్లో 20 రోజుల క్రితం పోసిన వడ్లను ఇప్పటికీ కొనుగోలు చేయలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

బస్తాకు 41 కిలోలు ఉండాల్సిన వడ్లను 42.200 కిలోలుగా తూకం వేస్తున్నారని వారు ఆరోపించారు. అలాగే ఇప్పటివరకు కేవలం రెండు లారీల వడ్లను మాత్రమే రైస్ మిల్లులకు తరలించారని, అక్కడికి చేరుకున్న తర్వాత కూడా బస్తాకు కిలో చొప్పున సుమారు 700 కిలోల వరకు తరుగు తీశారని.. దీంతో రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. దాదాపు అరగంట పాటు కొనసాగిన ఈ ధర్నాతో కరీంనగర్–జగిత్యాల రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

ఎలాంటి కొర్రీలు లేకుండా వెంటనే వడ్ల కొనుగోళ్లను వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. సమాచారం అందుకున్న గంగాధర ఎస్సై వంశీకృష్ణ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. అనంతరం అధికారులతో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>