కలం, కరీంనగర్ బ్యూరో: గౌరవెల్లి రిజర్వాయర్ ప్రాజెక్టు (Gouravelli Project) పనుల పురోగతిపై సచివాలయంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ, పునరావాసం, పర్యావరణ అనుమతులు, సవరించిన అంచనాలు, కాలువల పనులు, నీటి నిల్వలు తదితర అంశాలపై అధికారులు సమగ్రంగా వివరించారు.
2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ చేతుల మీదుగా గౌరవెల్లి రిజర్వాయర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. 2013 నాటికి సుమారు 57 శాతం పనులు పూర్తయ్యాయి. అనంతరం వివిధ పరిపాలనా కారణాలతో భూసేకరణ ప్రక్రియలో జాప్యం చోటుచేసుకుంది. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవెల్లి ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించి, గణనీయమైన పురోగతి సాధించినట్లు అధికారులు మంత్రులకు వివరించారు. మిగిలిన భూసేకరణను కూడా వేగవంతం చేసి ప్రాజెక్టు పనులను ముందుకు తీసుకెళ్లాలని మంత్రులు అధికారులను ఆదేశించారు.
రూ.17 లక్షల చొప్పున పరిహారం..
గౌరవెల్లి రిజర్వాయర్ కోసం భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు రూ.17 లక్షల చొప్పున పరిహారం అందించేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. సిద్దిపేట, హనుమకొండ, కరీంనగర్ జిల్లాల భూసేకరణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని మంత్రులు సూచించారు. వివాహిత కుమార్తెలకు పునరావాస ప్రయోజనాలు, పాత-కొత్త ముంపు ప్రాంతాల పరిధిలోని కుటుంబాలకు సంబంధించిన అంశాలను కూడా సమావేశంలో సమీక్షించారు.
భూసేకరణ పురోగతిపై చర్చ..
గౌరవెల్లి కాలువలకు సంబంధించిన భూసేకరణ పురోగతిని కూడా మంత్రులు సమీక్షించారు. ఇప్పటికే పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేసి, లబ్ధిదారులకు పరిహారం చెల్లింపులు కొనసాగుతున్నాయని అధికారులు వివరించారు. మిగిలిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసి కాలువల పనులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని ఆదేశించారు. గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించిన తాజా పర్యావరణ అనుమతుల అంశంపై సమావేశంలో చర్చించారు.
పర్యావరణ అనుమతులకు చర్యలు..
సంబంధిత కేంద్ర సంస్థల మార్గదర్శకాలకు అనుగుణంగా అవసరమైన తాజా పర్యావరణ అనుమతులు పొందేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రులకు అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయని వివరించారు. భూసేకరణ, పునరావాసం, ధరల పెరుగుదల తదితర కారణాల నేపథ్యంలో గౌరవెల్లి రిజర్వాయర్, కాలువలకు సంబంధించిన సవరించిన అంచనాలను ప్రభుత్వానికి సమర్పించినట్లు అధికారులు తెలిపారు.
అప్పడే టెండర్ల ప్రక్రియ..
మిగిలిన పనులకు పరిపాలనా అనుమతులు పొందిన అనంతరం టెండర్ల ప్రక్రియ చేపట్టనున్నట్లు సమావేశంలో వెల్లడించారు. ఎంఎంఆర్ ప్యాకేజీ-3 పనులకు సంబంధించిన సవరించిన అంచనాలు, అదనపు నిర్మాణాల ప్రతిపాదనలు, భవిష్యత్ కార్యాచరణపై కూడా సమీక్ష జరిగింది. అవసరమైన పర్యావరణ అనుమతులు, ఇతర ప్రభుత్వ అనుమతులు పొందిన వెంటనే గౌరవెల్లి రిజర్వాయర్ పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ (Uttam Kumar Reddy) అధికారులను ఆదేశించారు.
ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని పెండింగ్ అంశాలను నీటిపారుదల, రెవిన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పరిష్కరించాలని మంత్రి ఉత్తమ్ సూచించారు. భూసేకరణ, పునరావాసం, అనుమతులు తదితర అంశాల్లో జాప్యం లేకుండా చర్యలు తీసుకుని ప్రాజెక్టు పనులను నిర్దేశిత లక్ష్యాల మేరకు పూర్తి చేసే దిశగా ముందుకు సాగాలని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ కార్యదర్శి ఇ. శ్రీధర్, భూసేకరణ – పునరావాస కమిషనర్ శివకుమార్ నాయుడు, ఈఎన్‌సీ జనరల్ రమేష్ బాబు, ఈఎన్‌సీ ఓ&ఎం మధుసూదన్ రావు, జాయింట్ సెక్రటరీ కె. శ్రీనివాస్‌తో పాటు మూడు జిల్లాలకు చెందిన అధికారులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

