కలం, అచ్చంపేట : విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన పనులు చేపట్టాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ (Collector Hemanta Keshav Patil) అన్నారు. ఆయన శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం పరిధిలోని లింగాల మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా విద్యాలయ ప్రాంగణంలో జేసీబీ సహాయంతో చేపడుతున్న పరిసరాల శుభ్రత పనులను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు అందుతున్న వసతులు, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీరు, టాయిలెట్లు, భవనాల పరిస్థితి తదితర మౌలిక సదుపాయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
గురుకులంలోని (Gurukulam) టాయిలెట్లకు అవసరమైన మరమ్మతులు చేపట్టడంతో పాటు పాత భవనాలకు పెయింటింగ్ వేయించాలని, అవసరమైన చోట్ల భవనాల మరమ్మతు పనులను వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పనుల నిర్వహణలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
విద్యార్థులకు పరిశుభ్రమైన, సురక్షితమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడం అధికారుల బాధ్యత అని కలెక్టర్ పేర్కొన్నారు. గురుకులంలో అందుబాటులో ఉన్న మౌలిక వసతులను మెరుగుపరచి విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందేలా సమన్వయంతో చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట ఎమ్మార్వో వెంకటేష్, లింగాల గ్రామ సర్పంచ్ ఈశ్వరమ్మ, సంబంధిత అధికారులు ఉన్నారు.

