epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

బీజేపీ నేషనల్ చీఫ్‌గా ధర్మేంద్ర ప్రదాన్?

బీజేపీ నేషనల్ చీఫ్‌ (BJP National Chief)గా ధర్మేంద్ర ప్రదాన్ (Dharmendra Pradhan) పేరు దాదాపుగా ఖరారైంది. ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా పదవీ కాలం 2023లోనే ముగిసిపోయినా కొన్ని కారణాలతో ఆయనే కంటిన్యూ అవుతున్నారు. కొత్త అధ్యక్షుడి ఎన్నిక కోసం గత కొన్ని రోజులుగా కసరత్తు జరుగుతున్నా బిహార్ అసెంబ్లీ ఎన్నికలు, ప్రస్తుత పార్లమెంటు శీతాకాల సమావేశాలతో ఆలస్యమైంది. కొత్త అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి, భూపేంద్ర యాదవ్, వసుంధరా రాజె సింధియా, శివరాజ్ సింగ్ చౌహాన్ తదితరుల పేర్లు వినిపించినప్పటికీ వారందరికంటే ధర్మేంద్ర ప్రదాన్ అవకాశాలపైనే ఎక్కువ చర్చ జరుగుతున్నది. పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో సుదీర్ఘ అనుభవం ఉండడంతో పాటు కమిట్‌మెంట్‌తో ఉంటారని, పార్టీ లైన్‌ ప్రకారం నడుచుకుంటారనే సాధారణ టాక్ మొత్తం పార్టీలోనే నెలకొన్నది. ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా తదుపరి చీఫ్ ఎన్నికపై స్పెషల్ ఫోకస్ పెట్టారు.

ప్రధాని, అమిత్ షా తో నడ్డా భేటీ…

బీజేపీ కొత్త చీఫ్‌ (BJP New Chief) ఎన్నికపై ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా బుధవారం పార్లమెంటులో ప్రధాని మోడీతో, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో విడివిడిగా సమావేశమై చర్చించారు. వీలైనంత తొందరగా పేరును ప్రకటించి నామినేషన్ వేయించి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిక జరపడంపై చర్చించినట్లు తెలిసింది. కొత్త అధ్యక్షులుగా పలువురి పేర్లు వినిపించడంతో పాటు ఆసక్తి కనబరుస్తున్నందున వారి అనుకూల, ప్రతికూల అంశాలను వివరించి ఎవరికి బాధ్యతలు అప్పగిస్తే పార్టీ బెటర్‌గా ఉంటుందో తన అభిప్రాయాన్ని నడ్డా వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ నెలలోనే కొత్త అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియను కంప్లీట్ చేయాలనే ఏకాభిప్రాయం వ్యక్తమైంది. శీతాకాల సమావేశాలు ఈ నెల 20న ముగుస్తుండడంతో ఆ తర్వాత పది రోజుల్లోనే ప్రక్రియను పూర్తి చేయాలని పార్టీ భావిస్తున్నది.

బిహార్ సక్సెస్‌ ధర్మేంద్రకు అడ్వాంటేజ్…

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు బాధ్యతను పార్టీ నాయకత్వం ధర్మేంద్ర ప్రదాన్‌కు అప్పజెప్పింది. క్షేత్రస్థాయిలో పర్యటించి పార్టీకి ఉన్న అనుకూల, ప్రతికూల అంశాలను స్టడీ చేసి నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల పేర్లను ఖరారు చేయడం మొదలు పోల్ మేనేజ్‌మెంట్ వరకు ప్రత్యేక వ్యూహాన్ని రూపొందించి అమలు చేశారు. పార్టీ, ప్రజల ఊహకు అందని తీరులో బిహార్ రిజల్ట్ రావడంతో ధర్మేంద్ర ప్రదాన్‌కు జాతీయ అధ్యక్షుడి బాధ్యతలు అప్పజెప్తే మూడేండ్ల తర్వాత జరిగే పార్లమెంటు ఎన్నికల్లోనూ అదే తరహా విజయాన్ని సాధించవచ్చన్న అభిప్రాయాన్ని పలువురు సీనియర్‌లు వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇప్పటికే దాదాపు పాతిక రాష్ట్రాల్లో స్టేట్ చీఫ్‌ల నియామకం పూర్తయింది. మరో తొమ్మిది రాష్ట్రాల్లో మాత్రమే సంస్థాగత ఎన్నికలను నిర్వహించాల్సి ఉన్నది. అవి పూర్తికాకపోయినా నేషనల్ చీఫ్ (BJP National Chief) ఎన్నికలను కంప్లీట్ చేయాలని పార్టీ నాయకత్వం ఆలోచిస్తున్నది.

Read Also: పేర్లు మార్చుతున్న మోడీ.. ఇప్పటి దాకా మార్చినవి ఇవే..

Follow Us on: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>