కలం వెబ్ డెస్క్ : న్యూ ఇయర్(New Year) వేళ వినియోగదారులకు, ఆయా సంస్థలకు గిగ్ వర్కర్లు(Gig Workers) షాకిచ్చారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ దేశవ్యాప్తంగా నేడు మరోసారి సమ్మె(Strike)కు దిగారు. సుమారు 1.5 లక్షల మంది సమ్మెలో పాల్గొనే అవకాశం ఉంది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో ఉదయం నుంచి స్విగ్గీ(Swiggy), జొమాటో(Zomato), బ్లింకిట్, అమెజాన్(Amazon), ఫ్లిప్ కార్ట్(Flipkart), జెప్టో తదితర సేవల్లో అంతరాయం ఏర్పడింది. తమకు సరైన వేతనం చెల్లించాలని, ప్రమాద బీమా కల్పించాలని గిగ్ వర్కర్లు ఎన్నో రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నారు. చార్జీలను తగ్గించాలని, పది నిమిషాల డెలివరీ విధానాన్ని కూడా రద్దు చేయాలని కోరుతున్నారు. సంస్థలు తమతో ఎక్కువ పని చేయించుకొని తక్కువ వేతనాలు చెల్లిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. తమకు ఉద్యోగ భద్రత, గౌరవం కావాలని కోరుతున్నారు.
ఈ డిమాండ్లపై గతంలో సైతం వీరు సమ్మెలు చేశారు. ఇటీవల డిసెంబర్ 25న చేసిన సమ్మె వినియోగదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగించింది. వేలాది ఆర్డర్లు క్యాన్సిల్ అయ్యాయి. మరికొన్ని ఆలస్యంగా డెలివరీ అయ్యాయి. ఈ సమ్మెకు కొనసాగింపుగా నేడు మరోసారి తమ గళం వినిపించనున్నారు. స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, అమెజాన్, ఫ్లిప్ కార్ట్, జెప్టో కార్మికులు సమ్మెలో పాల్గొననున్నారు. మరికొన్ని గంటల్లో కొత్త సంవత్సరం రానుంది. వినియోగదారులు విపరీతంగా ఆన్‌లైన్ ఆర్డర్లు చేస్తారు. ఈ నేపథ్యంలో ఈ సమ్మె ప్రజల న్యూ ఇయర్ ప్లాన్లను తీవ్రంగా ఎఫెక్ట్ చేస్తుందని తెలుస్తోంది. మరి గిగ్ వర్కర్ల సమస్యలపై కంపెనీలు ఎలా స్పందిస్తాయి? కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది? అనేది వేచి చూడాలి.


