Mobile Popup Ad
Mobile Popup Ad

అమీన్‌పూర్‌లో బదిలీ డ్రామా.. 48 గంటల్లో ట్విస్ట్‌లు

క‌లం, మెద‌క్ బ్యూరో : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) విస్తరణలో భాగంగా సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్(Ameenpur) ప్రాంతం విలీనం అయిన తర్వాత కూడా వివాదాలు తగ్గడం లేదు. తాజాగా అమీన్‌పూర్ సర్కిల్‌లో కేవలం 48 గంటల్లో చోటుచేసుకున్న పరిణామాలు అధికార వర్గాల్లోనే కాక ప్రజల్లో కూడా అనేక సందేహాలకు తావిస్తున్నాయి. అమీన్‌పూర్ మున్సిపాలిటీ జీహెచ్‌ఎంసీలో విలీనం కావడంతో అభివృద్ధి వేగవంతమవుతుందని స్థానికులు ఆశించారు. అయితే వాస్తవానికి మౌలిక వసతుల సమస్యలు ఇంకా కొనసాగుతుండగా, తాజాగా జరిగిన అధికారిక పరిణామాలు మరింత గందరగోళానికి దారితీశాయి.

ఈ నెల 7వ తేదీన అమీన్‌పూర్ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్న ప్రదీప్ కుమార్‌ను హఠాత్తుగా రాత్రికి రాత్రే బదిలీ చేశారు. ఆయన స్థానంలో మూసాపేట డిప్యూటీ కమిషనర్ ఆంజనేయులను నియమించారు. అయితే ఇదే సమయంలో, 8వ తేదీన అమీన్‌పూర్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం మరింత చర్చనీయాంశమైంది. కార్యాలయ నిర్వహణ, సిబ్బంది హాజరు, అకౌంట్స్, టౌన్ ప్లానింగ్ అనుమతుల ఫైళ్లను అధికారులు పరిశీలించినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా, కొత్తగా బాధ్యతలు స్వీకరించాల్సిన ఆంజనేయులు ముందుకు రాకముందే, 9వ తేదీన మళ్లీ ప్రదీప్ కుమార్‌ను డిప్యూటీ కమిషనర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడడం సంచలనం రేపింది. కేవలం 48 గంటల్లో బదిలీ, విజిలెన్స్ తనిఖీలు, తిరిగి నియామకం జరగడం వెనుక అసలు కారణాలేమిటన్నది పెద్ద ప్రశ్నగా మారింది. అధికార వర్గాల్లో ఈ పరిణామాలపై విస్తృత చర్చ జరుగుతోంది. ప్రదీప్ కుమార్‌ను తొందరపాటుగా ఎందుకు బదిలీ చేశారు? తిరిగి అదే అధికారిని ఇంత త్వరగా ఎలా నియమించారు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ పరిణామాలు కింది స్థాయి సిబ్బందిలో అయోమయాన్ని సృష్టించడమే కాక, పరిపాలనా వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అమీన్‌పూర్ (Ameenpur) పరిధిలో కొత్తగా ఏర్పడిన కాలనీలలో  రోడ్లు, డ్రైనేజీలు, శానిటేషన్, ప్రభుత్వ భూముల పరిరక్షణ, చెరువుల పునరుద్ధరణ వంటి అనేక అభివృద్ధి పనులు పెండింగ్‌లో ఉన్నాయి. తరచూ అధికారులను మార్చడం వల్ల ఈ పనులు మరింత ఆలస్యమవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా అమీన్‌పూర్ సర్కిల్‌లో జరిగిన ఈ అనూహ్య పరిణామాలు రాజకీయ, పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Read Also: గొల్లపల్లి రిజర్వాయర్‌ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?: జూపల్లి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>