కలం, వెబ్ డెస్క్: తెలంగాణవ్యాప్తంగా చైన్ స్నాచర్స్ (Chain Snatching) హల్‌చల్ చేస్తున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా స్నాచింగ్స్‌కు పాల్పడుతూ ప్రజలను భయాభ్రాంతులకు గురిచేస్తున్నారు. గత నెల రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 15 నుంచి 20కిపైగా ఘటనలు వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్‌లోని (Hyderabad) శివారు ప్రాంతాలతోపాటు హనుమకొండ, వరంగల్ వంటి నగరాల్లో పదుల సంఖ్యలో ఘటనలు నమోదయ్యాయి. ఈ వారంలోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, కీసర, హనుమకొండ పరిసర ప్రాంతాల్లో వరుస దోపిడీలు జరిగాయి. ముఖ్యంగా తెల్లవారుజామున, సాయంత్రం వేళల్లో ఒంటరిగా వెళ్లే మహిళలనే లక్ష్యంగా చేసుకుని దుండగులు బైక్‌లపై వచ్చి గొలుసులను తెంచుకుపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో నిందితులను పట్టుకున్నప్పటికీ, కొత్త ముఠాలు రంగంలోకి దిగడం పోలీసులకు సవాలుగా మారుతోంది.
ఏయే ఏరియాల్లో..
ప్రాంతాలవారీగా చూస్తే.. సైబరాబాద్ పరిధిలోని చందానగర్, కూకట్‌పల్లి, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని హయాత్‌నగర్, నాగోల్, చైతన్యపురి కాలనీల్లో తరచుగా స్నాచింగ్‌లు (Chain Snatching) జరుగుతున్నాయి. వరంగల్, హనుమకొండ పరిధిలోనే ఒకే ముఠా అనేక చోట్ల దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించి, సుమారు 25 లక్షల రూపాయల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు గస్తీ పెంచినప్పటికీ, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
పెరుగుతున్న బంగారం ధరలే కారణమా..
ప్రస్తుతం బంగారం ధరలు భగ్గుమంటుండటంతో నేరగాళ్లకు అవకాశంగా మారింది. సాధారణ మధ్యతరగతి మహిళలను లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్స్‌కు పాల్పడుతున్నారు. మార్కెట్లో తులం బంగారం ధర భారీగా పెరగడంతో, ఒక్క గొలుసును దొంగిలించినా లక్షల రూపాయలు సంపాదించవచ్చనే దురాశతో స్నాచింగ్స్‌కు పాల్పడుతున్నారు. దీంతో నగరాల్లోనే కాకుండా శివారు ప్రాంతాల్లో జనాలు మెడలో బంగారం వేసుకోవాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మహిళలు బయటకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
Read Also: ఏఐతో పెరిగిన మైనింగ్, రవాణా శాఖల ఆదాయం: భట్టి
Follow Us On : WhatsApp

