Mobile Popup Ad
Mobile Popup Ad

యాదగిరిగుట్ట టు HYD.. గెస్ట్ లెక్చరర్స్ మహా పాదయాత్ర

కలం, యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారి ఆశీస్సులతో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అతిథి అధ్యాపకులు (Guest Lecturers) తమ నిరసన గళాన్ని విప్పారు. తమ జీవితాల్లో ఏళ్ల తరబడి కొనసాగుతున్న వెట్టిచాకిరిని నిర్మూలించాలని, సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యాదగిరిగుట్ట నుండి హైదరాబాద్ వరకు మూడు రోజుల ‘మహా పాదయాత్ర’ను సోమవారం ఘనంగా ప్రారంభించారు. యాదగిరిగుట్ట (Yadagirigutta) వైకుంఠ ద్వారం వద్ద అధ్యాపకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, కొబ్బరికాయ కొట్టి పాదయాత్రను మొదలుపెట్టారు. అనంతరం స్థానిక అమరవీరుల స్తూపం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అతిథి అధ్యాపకుల సంఘం నాయకులు నర్సింగ్ మాట్లాడారు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అభివృద్ధి కోసం, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం తాము రాత్రింబవళ్లు కష్టపడుతున్నా.. తమ జీవితాలకు, ఉపాధికి మాత్రం ఎలాంటి భద్రత లేకుండా పోయిందని నర్సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అతిథి అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు రూ. 50 వేల గౌరవ వేతనం ఇస్తామని నాడు హామీ ఇచ్చి, నేడు అధికారంలోకి వచ్చాక పట్టించుకునే నాథుడే కరువయ్యాడని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా 1,940 మంది అతిథి అధ్యాపకుల కుటుంబాలు ప్రతి ఏటా తీవ్రమైన మానసిక నరకాన్ని అనుభవిస్తున్నాయని వారు పేర్కొన్నారు.

“ప్రతి సంవత్సరం ఎలాంటి రెన్యువల్ పాలసీ లేకుండా, మళ్లీ డెమోలు, త్రీమెన్ కమిటీల పేరుతో మమ్మల్ని తీవ్రమైన మానసిక వేధింపులకు గురిచేస్తున్నారు. కేవలం 6 నెలల వేతనం మాత్రమే చేతికి ఇస్తూ, 12 నెలల పాటు మాతో వెట్టిచాకిరి చేయించుకుంటున్నారు” అని అధ్యాపకులు తమ అభాగ్య స్థితిని వివరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలపై తక్షణమే దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. అతిథి అధ్యాపకులు చేపట్టిన ఈ మహా పాదయాత్రకు బీఆర్‌ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత పూర్తి మద్దతు ప్రకటించారు.

యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు సుజిత్ రావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు అధ్యాపకుల న్యాయమైన పోరాటానికి సంఘీభావం తెలిపారు. ఈనెల 25, 26, 27 తేదీల పాటు మూడు రోజుల పాటు సాగనున్న ఈ మహా పాదయాత్ర ప్రారంభ కార్యక్రమంలో సంఘం నాయకులు మచ్చ చక్రధర్, ఆకుల నరేష్, అధ్యాపకులు శంకరయ్య, చంద్రశేఖర్, వెంకటరెడ్డి, బూచ్చిపాల్ రెడ్డి, సుధమ, సంధ్య, స్వప్న, కిషోర్, హరికృష్ణ, రాజేష్, గణేష్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>