Mobile Popup Ad
Mobile Popup Ad

GHMC ఫైట్.. పార్టీల పోటాపోటీ వ్యూహాలు

కలం, తెలంగాణ బ్యూరో : మూడురోజుల కింద కోహెడ, రెండు రోజుల కింద మల్కాజిగిరి, తాజాగా సైబరాబాద్.. ఇలా వరుసగా శంకుస్థాపనలు, అభివృద్ధి పనులు చేపడుతున్న సీఎం రేవంత్ రెడ్డి!. వారం కింద సికింద్రాబాద్, అంతకు ముందు కంటోన్మెంట్, ముషీరాబాద్.. ఇలా నియోజకవర్గాల వారీగా పార్టీ నేతలతో రివ్యూలు మీద రివ్యూలు చేస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్!. నాలుగురోజుల కింద కోహెడలో పర్యటన, ఆ తర్వాత ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెడుతున్న బీజేపీ స్టేట్ చీఫ్​ రాంచందర్రావు..!. ఇలా మూడు పార్టీల ఈ ముగ్గురు ముఖ్య నేతలు గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ తిరుగుతున్నారు. పార్టీ కార్యకర్తలను కలుస్తున్నారు. జనం వద్దకు వెళ్తున్నారు. సవాళ్లు ప్రతిసవాళ్లతో హోరెత్తిస్తున్నారు. ఇదంతా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల (GHMC Elections) కోసమేనన్న బలమైన సంకేతాలు పంపుతున్నారు.

సిటీలో పట్టు కోసం మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇంతకాలం జీహెచ్ఎంసీ పేరుతో ఒకే మున్సిపల్ కార్పొరేషన్‌గా ఎన్నికలు జరిగాయి. కానీ ఇప్పుడు జీహెచ్ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లుగా ఏర్పడ్డాయి. ఈ మూడింటికీ ఎన్నికలు జరగడంపై ఇంకా క్లారిటీ రాలేదు. సెన్సస్ విభాగం ఆంక్షల గడువు ముగిసిన తర్వాత క్లారిటీ రానున్నది. ఎలక్షన్స్ ఎప్పుడొస్తాయనే అంశంతో సంబంధం లేకుండా మూడు పార్టీలూ ఇప్పటికే సన్నాహాలు స్టార్ట్ చేశాయి.

జీహెచ్ఎంసీలో గత వైభవాన్ని నిలుపుకోవాలన్నది, ఈసారి మేయర్ స్థానాలను చేజిక్కించుకోవాలని బీజేపీ చూస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో సిటీ చుట్టూ ఉన్న సీట్లను గెల్చుకున్నందున ఈసారి లోకల్​ బాడి ఎన్నికల్లోనూ గెలుపు దక్కాల్సిందేనన్నది బీఆర్ఎస్ భావిస్తున్నది. అధికారంలో ఉన్నందున ఆరు నూరైనా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తరహాలో మూడు కార్పొరేషన్లనూ చేజిక్కించుకుంటామని కాంగ్రెస్ బలంగా నమ్ముతున్నది. జీహెచ్ఎంసీ పరిధిలోని లోకల్​ బాడి ఎన్నికల్లో గెలుపు ఈ మూడు పార్టీలకూ సవాలే. అనుకూల అంశాలున్నట్లుగానే ప్రతి పార్టీకి ప్రతికూలమైనవీ ఉన్నాయి. గ్రేటర్ సిటీలో కాంగ్రెస్‌కు పట్టు తక్కువగా ఉన్నట్లు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పర్సెంటేజీ, ఫలితాలతో స్పష్టమైంది. కంటోన్ మెంట్ తో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ గెలవడంతో సిటీ జనంలో ఆదరణ పెరిగిందని కాంగ్రెస్ నేతలు విశ్వసిస్తున్నారు.

అభివృద్ధి మంత్రంతో జనంలోకి వెళ్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిటీ పరిధిలోనే బీఆర్ఎస్ ఎక్కువ సీట్లు గెల్చుకుంది. అయితే.. ఆ తర్వాత జరిగిన రెండు ఉప ఎన్నికల్లోనూ సిట్టింగ్ సీట్లను కోల్పోవడం గులాబీ పార్టీకి మైనస్. అర్బన్ ఓటర్లలో ఉన్న మోదీ క్రేజ్, దానికి తోడు సిటీ పరిధిలో నాలుగు ఎంపీ స్థానాలను గెలుచుకోవడం బీజేపీకి ప్లస్. అయితే.. ఇటీవల జరిగిన మున్సి‘పోల్స్’లో పెద్దగా ప్రభావం చూపకపోవడం గ్రేటర్ హైదరాబాద్​ పైనా పడొచ్చన్న ఆందోళన కమలం శ్రేణుల్లో నెలకొంది. ఏది ఏమైనా గ్రేటర్​ పై పట్టు సాధించాలని మూడు పార్టీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి.

మూడు కార్పొరేషన్లనూ గెలిచి తీరాల్సిందేనని కేడర్​ కు సూచిస్తున్నాయి. ముఖ్య నేతలతోపాటు, ఇతర నేతలు కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పర్యటిస్తున్నారు. అయితే.. మూడు కార్పొరేషన్ల ఏర్పాటు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల (GHMC Elections) అంశం చుట్టూ లీగల్ అంశాలు ముడిపడి ఉన్నాయి. వాటికితోడు సెన్సస్ పూర్తయ్యే వరకు సరిహద్దులు మార్చొద్దన్న ఆంక్షలతో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్నది సస్పెన్స్.

అభివృద్ధి మంత్రంతో కాంగ్రెస్..

అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి గ్రేటర్ హైదరాబాద్ ఎప్పుడూ ఒక సవాలులాంటిది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన సీట్లు రాలేదు. ఈ ఎన్నికలతో పట్టు సాధించాలని పట్టుదలగా ఉంది. సైబరాబాద్, మల్కాజిగిరి, హైదరాబాద్ పరిధిలో వేల కోట్ల రూపాయలతో మౌలిక వసతుల కల్పన, ఫ్లై-ఓవర్లు, మెట్రో విస్తరణ పనులకు శంకుస్థాపనలు.. ఇలాంటివాటితో నగరాభివృద్ధికి కట్టుబడి ఉన్నామనే సంకేతాన్ని ప్రజల్లోకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలంగా తీసుకెళ్తున్నారు. మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు.. ఇలాంటివన్నీ ప్రస్తావించి బీజేపీకి అర్బన్‌లో పట్టు ఉన్న ఓటర్లకు సీఎం తనదైన శైలిలో స్పష్టమైన మెసేజ్ ఇస్తున్నారు.

సొంత నిధులతో అభివృద్ధి చేసుకుంటామని చెప్తున్నా కేంద్రం అనుమతి ఇవ్వడంలేదని, సిటీ చుట్టూ నలుగురు బీజేపీ ఎంపీలున్నా అడ్డుకుంటున్నారనే ఆరోపణలతో ఆ పార్టీని కార్నర్ చేస్తున్నారు. అధికారంలో ఉండడంతో పాటు సీఎం స్వయంగా పర్యవేక్షిస్తుండడం ఆ పార్టీకి అనుకూల అంశం. క్షేత్రస్థాయిలో ఇతర పార్టీలతో పోలిస్తే పటిష్టమైన కార్పొరేటర్ స్థాయి కేడర్ నెట్‌వర్క్ లోటును భర్తీ చేసుకోవాల్సి రావడం ప్రతికూల అంశం.

కేటీఆర్‌పైనే ఆశలుపెట్టుకున్న బీఆర్ఎస్

నగర పరిధిలో బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికీ బలమైన క్యాడర్ ఉన్నది. మరే పార్టీకంటే ఎక్కువగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఉన్నారు. అన్ని పార్టీలకంటే ముందే సన్నాహక సమావేశాలు మొదలుపెట్టింది. అధికారం కోల్పోయిన తర్వాత స్థానిక సంస్థల నేతలు అధికార పార్టీ వైపు వెళ్లకుండా నిరోధించడం బీఆర్ఎస్ తొలి ప్రాధాన్యతగా మారింది. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కార్పొరేటర్లతో వరుస రివ్యూలు అందులో భాగమే.

“మా హయాంలోనే హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారింది.. పురపాలక మంత్రిగా కేటీఆర్ చేసిన అభివృద్ధి పనులే ప్రజలకు సౌకర్యంగా మారాయి..” అనే బ్రాండ్ ఇమేజ్‌ను ప్రయోగిస్తున్నది. సిట్టింగ్ ఎమ్మెల్యేలుండటం సానుకూలాంశమే అయినా అధికారం చేజారడంతో లోకల్ లీడర్లలో నిరుత్సాహం, యాక్టివ్‌గా ఉంచడం ప్రధాన సవాల్. ఈసారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీయే అని పదేపదే కామెంట్ చేసి కేడర్‌లో జోష్ రేకెత్తించే ప్రయత్నం చేస్తున్నది. అన్ని నియోజకవర్గాల మీటింగుల్లో స్వయంగా కేటీఆర్ పాల్గొని శ్రేణులకు భరోసా కలిగించే ప్రయత్నం చేస్తున్నారు.

‘గత వైభవం – పార్లమెంట్ జోష్’ ఆశల్లో బీజేపీ

గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో (GHMC Elections) అనూహ్యంగా 48 స్థానాలు గెలుచుకుని సంచలనం సృష్టించిన బీజేపీ.. ఈసారి హైటెక్ సిటీ, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లపైనా ఫోకస్ పెట్టింది. సికింద్రాబాద్, మల్కాజిగిరి లాంటి అర్బన్ పార్లమెంట్ స్థానాల్లో ఉన్న పట్టును, గెలుపును వాడుకోవాలనుకుంటున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ షేర్‌ను మున్సిపల్ ఎన్నికల్లో సీట్లుగా మార్చుకోవాలని చూస్తున్నది. ఐటీ కారిడార్‌గా ఉన్న సైబరాబాద్, భారీ నివాస ప్రాంతాలున్న మల్కాజిగిరి ప్రాంతాల్లో విద్యావంతులు, వలస ఓటర్లు, మిడిల్ క్లాస్, హిందూ ఓటర్లను సమీకరించడం, కాంగ్రెస్-మజ్లిస్ పార్టీల దోస్తీని, బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టడం ప్రధాన స్ట్రాటజీగా భావిస్తున్నది.

అర్బన్ ఓటర్లలో మోదీపై ఉన్న క్రేజ్, కేంద్ర ప్రభుత్వ పనితీరు కలిసొచ్చే అంశం. లోకల్ బాడీ ఎన్నికలకు అవసరమైన వార్డు స్థాయి స్థానిక ఆర్థిక బలం, గ్రౌండ్ లెవెల్‌లో లీడర్ల కొరత కొన్ని డివిజన్లలో ప్రతికూల అంశం. జాతీయ అంశాలతో పాటు స్థానికంగా కనిపించే ట్రాఫిక్, వరదలు, చెత్త నిర్వహణ, రోడ్ల నాణ్యత, ఆస్తిపన్ను, పౌర సేవల అంశాలను అజెండాగా మార్చే ప్రయత్నం చేస్తున్నది. నగరానికి కేంద్రం ఇచ్చిన నిధులు, చేపట్టిన ప్రాజెక్టులను ప్రచారంలో వినియోగించాలని భావిస్తున్నది.

Read Also: హిట్లర్ వార్.. నాడు కేసీఆర్, నేడు రేవంత్ సేమ్ స్పీచ్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>