కలం, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాజకీయాల్లో ‘హిట్లర్’ ప్రస్తావన (Hitler Remarks) మరోసారి ప్రకంపనలు సృష్టిస్తున్నది. పరిపాలనలో కఠినత్వం అవసరమని చెప్పే క్రమంలో గతంలో మాజీ సీఎం కేసీఆర్ (KCR), తాజాగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇద్దరూ హిట్లర్‌ను ఉటంకించారు. వ్యవస్థను ప్రక్షాళన చేయాలంటే ప్రభుత్వాలు కఠినంగా ఉండక తప్పదనే సందేశాన్ని ఇవ్వడమే వారి ఉద్దేశమైనప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా నియంతగా ముద్రపడిన హిట్లర్ పేరును స్ఫూర్తిగా, పోలికగా తీసుకోవడమే ఇప్పుడు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నది.
హిట్లర్ రోల్ మోడలా?: బీఆర్ఎస్
సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేసిన హిట్లర్ వ్యాఖ్యలను ప్రతిపక్ష బీఆర్ఎస్ ఒక అస్త్రంగా మార్చుకుంది. ‘‘హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకున్నానంటూ సీఎం మాట్లాడటం అహంకారానికి నిదర్శనం. చరిత్రలో హిట్లర్ కు పట్టిన గతే రేవంత్‌రెడ్డికి పడుతుంది’’ అని హరీశ్‌రావు పెద్దపల్లిలో వ్యాఖ్యానించాడు. కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ‘‘కోట్ల మందిని పొట్టనబెట్టుకున్న నరరూప రాక్షసుడు హిట్లర్ నీకు రోల్ మోడలా? ప్రజా పాలన, ఇందిరమ్మ పాలన అని చెప్పి, చివరకు హిట్లర్ పాలన అని ఒప్పుకున్నావు. హిట్లర్ హఠావో.. తెలంగాణ బచావో”అని ఆయన ట్వీట్ చేశారు.
కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారు: కాంగ్రెస్
2014లో కేసీఆర్ (KCR) ‘హిట్లర్’ వ్యాఖ్యలు చేసినప్పుడు సమర్థించుకున్న బీఆర్ఎస్ నేతలు, ఇప్పుడు రేవంత్ రెడ్డి విషయంలో విమర్శలు చేయడాన్ని కాంగ్రెస్ నేతలు తప్పుబడుతున్నారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. కబ్జాకోరుల నుంచి చెరువులను, భూములను కాపాడే ఉక్కు సంకల్పంతోనే హైడ్రా పనిచేస్తుందని, బీఆర్ఎస్ నేతలు గురువింద గింజ సామెతను గుర్తు చేసుకోవాలని ఎద్దేవా చేశారు.
భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి స్పందిస్తూ.. సందర్భాన్ని వదిలేసి కేవలం ‘హిట్లర్’ పదాన్ని పట్టుకుని విమర్శలు చేయడం ‘కోడిగుడ్డు మీద ఈకలు పీకడం’ వంటిదని మండిపడ్డారు. గతంలో కేసీఆర్ స్వయంగా తనను తాను హిట్లర్‌తో పోల్చుకున్న విషయాన్ని విస్మరించి, ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలను సోషల్ మీడియాలో నెటిజెన్లు సైతం తప్పుబడుతున్నారు.
గతంలో కేసీఆర్ ఏమన్నారంటే?
రాష్ట్రం ఏర్పడిన కొత్తలో.. అర్హులైన వారిని గుర్తించి, బోగస్ లబ్ధిదారులను ఏరివేయడానికి 2014 ఆగస్టులో ప్రభుత్వం ‘సమగ్ర కుటుంబ సర్వే’ను ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అయితే, ఈ సర్వే విధానంపై అప్పట్లో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. కేసీఆర్ ను ‘హిట్లర్’తో పోల్చి విమర్శించాయి. దీనిపై 2014 ఆగస్టు 17న జరిగిన మీడియా సమావేశంలో కేసీఆర్ స్పందిస్తూ.. ‘‘అవును, నన్ను హిట్లర్ అంటుంటే నేనేమీ సిగ్గుపడటం లేదు.
అక్రమాలను, వ్యవస్థను దోచుకునేవారిని అరికట్టడానికి హిట్లర్ కంటే కఠినంగా ఉంటాను. దొంగలపాలిట, పైరవీకారుల పాలిట కేసీఆర్ హిట్లరే. వ్యవస్థ ప్రక్షాళన కోసమే నేను కఠినంగా ఉన్నాను. ప్రజాధనం దుర్వినియోగం జరిగితే, హిట్లర్ కంటే దారుణంగా వ్యవహరిస్తా.. ఐ వాంటెడ్ టు బి హిట్లర్.. ఐ డోంట్ ఫీల్ షేమ్.. ప్రభుత్వం డబ్బులు ఇష్టమొచ్చినట్లు దుర్వినియోగం చేస్తే హిట్లర్ లాగ కాదు వాని తాతకన్నా ఎక్కువగా కఠినంగా వ్యవహరిస్తా’’ అని తన నిర్ణయాన్ని గట్టిగా సమర్థించుకున్నారు.
ఇప్పుడు సీఎం రేవంత్ రెండ్డి కామెంట్స్
ప్రజాధనం దుర్వినియోగాన్ని అరికట్టేందుకు 2014లో కేసీఆర్ ‘హిట్లర్’ ప్రస్తావన తీసుకురాగా.. తాజాగా బెంగళూరులో జరిగిన ‘ది హిందూ’ కాంక్లేవ్లో సీఎం రేవంత్‌రెడ్డి హైడ్రా వ్యవస్థ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. “హిట్లర్‌కు ఇష్టమైన పదం హైడ్రా… ఆయన అప్పట్లో పెట్టుకున్న కోర్ టీమ్‌కు హైడ్రా అని పేరు పెట్టుకున్నారు… ఎవరినైనా అది నిర్మూలించగలదు… హిట్లర్ నుంచి నేను స్ఫూర్తిగా తీసుకున్నాను… ప్రభుత్వ స్థలాలను కబ్జాచేసేవారి భరతం పట్టడానికి ఏర్పాటు చేసిన విభాగానికి హైడ్రా పేరు పెట్టాను… దానికి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్‌ను బాధ్యుడిగా పెట్టాను… ఆయన కింద సుమారు 3000 మంది రిటైర్డ్ ఆర్మీ జవాన్ల లాంటివారు ఉన్నారు… హైడ్రా వ్యవస్థ తెలంగాణలో ఉనికిలోకి వచ్చిన తర్వాత కబ్జాలు ఆగిపోయాయి” అని రేవంత్ స్పష్టం చేశారు.
ఎన్డీఏ నేత కూడా నాలుక కర్చుకుని..
2014-19 మధ్య ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన కర్ణాటక నేత అనంతకుమార్ హెగ్డే కూడా గతంలో హిట్లర్ ప్రస్తావన తెచ్చి వివాదంలో చిక్కుకున్నారు. అప్పట్లో ఆయన, “హిట్లర్ క్రూరుడు, నియంత కావొచ్చు.. కానీ దేశభక్తి (జాతీయవాదం) విషయంలో ఆయనను తప్పుబట్టలేం” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు దారితీయడంతో, చివరికి ఆయన స్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
Read Also: జులై 1 నుంచి కొత్త చట్టం.. రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు
Follow Us On: Sharechat

