దేవుడి పటాలను చెట్ల కింద వదిలేస్తున్నారా? ఇకపై అలా చేయకండి

కలం, వెబ్‌డెస్క్: Project Udvasana | మన ఇళ్లలో సుదీర్ఘకాలం భక్తిశ్రద్ధలతో పూజించిన దేవుడి పటాలు పాతబడినా, లేదా విగ్రహాలు విరిగిపోయినా… వాటిని చెత్తబుట్టలో వేయడానికి మన మనసు అస్సలు ఒప్పుకోదు. అందుకే, వాటికి పవిత్రత ఉంటుందనే నమ్మకంతో చాలామంది భక్తులు పెద్ద పెద్ద రావి చెట్లు, మర్రి చెట్ల కింద ఉంచడం లేదా నదులు, కాల్వలు, చెరువుల ఒడ్డున వదిలివేయడం కాలక్రమేణా ఒక ఆనవాయితీగా మార్చుకున్నారు.

అయితే, అలా చెట్ల కింద వదిలేసిన పటాలు గాలి వానలకు కొట్టుకుపోయి చివరకు మున్సిపల్ వ్యర్థాల్లో కలవడం, చెరువుల్లో వేసినవి నీటిని కలుషితం చేయడం వంటివి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ, పర్యావరణానికి పెద్ద సమస్యగా మారాయి. ఈ నేపథ్యంలోనే, సాంప్రదాయ విలువలను కాపాడుతూ పర్యావరణాన్ని రక్షించేందుకు జీహెచ్‌ఎంసీ (GHMC) & హరే కృష్ణ మూవ్‌మెంట్ సంయుక్తంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘ప్రాజెక్ట్ ఉద్వాసన’ (Project Udvasana) కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి.

జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో, ప్రజలు తమ ఇళ్లలో ఉన్న పాత దేవుడి పటాలు, విగ్రహాలను బంజారాహిల్స్ రోడ్ నంబర్-12లోని ఇస్కాన్ ఆలయానికి స్వచ్ఛందంగా అందజేయవచ్చు. వీటికి సంప్రదాయ పద్ధతిలో ఉద్వాసన నిర్వహించి, అనంతరం పర్యావరణహిత రీసైక్లింగ్ ప్రక్రియ చేపడతారు.

ఉద్వాసన అంటే ఏమిటి?

పూజలు, వ్రతాలు లేదా ఉత్సవాలు పూర్తయిన తర్వాత ఆరాధించిన దేవతలకు గౌరవప్రదంగా వీడ్కోలు చెప్పే ఆచారాన్ని ‘ఉద్వాసన’ అంటారు. ఈ సందర్భంగా విగ్రహాలు లేదా పటాలను కదిలిస్తూ, దైవత్వం తన యథాస్థానానికి చేరాలని ప్రార్థనలు చేస్తారు. హిందూ సంప్రదాయంలో ఇది ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రక్రియగా భావిస్తారు. ఈ కొత్త కార్యక్రమం ద్వారా పాత దేవతా పటాలు, విగ్రహాలకు గౌరవప్రదమైన నిర్వహణతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా మార్గం సుగమం అవుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

దేవుడి పటాలు లేదా విగ్రహాలను తీసుకువచ్చే భక్తులు ముందుగా ఆలయ వెబ్‌సైట్‌లో తమ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం ఆలయ ప్రాంగణంలో వాటిని భద్రపరుస్తారు. ప్రతిరోజూ ఉదయం 11 గంటల తర్వాత అన్ని పటాలు, విగ్రహాలకు కలిపి ప్రత్యేక ఉద్వాసన పూజ నిర్వహిస్తారు. ఆ తరువాత శిక్షణ పొందిన వాలంటీర్లు రీసైక్లింగ్ ప్రక్రియను ప్రారంభిస్తారు. పటాల్లోని అద్దాలు, చెక్క భాగాలు, కాగితాలు, ఇతర పదార్థాలను వేరు చేసి వాటిని తిరిగి వినియోగానికి అనువుగా మార్చేందుకు రీసైక్లింగ్ కేంద్రాలకు పంపిస్తారు. ఈ విధానం ద్వారా చెత్తగా మారిపోయే వస్తువులకు కొత్త జీవం లభించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పాటు అందుతుంది.

Read Also: గూగుల్ మ్యాప్స్‌లో సూపర్ ఫీచర్.. ఈ చిన్న సెట్టింగ్‌తో పెట్రోల్ ఆదా

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>