గట్టులో గుప్త నిధుల‌ వేట ఆగేదెప్పుడు?.. వరుస తవ్వకాలతో ఆందోళన!

కలం, జోగులాంబ గద్వాల: గట్టు మండల కేంద్రంలో గత కొన్ని నెలలుగా గుప్త నిధుల వేట (Gattu Treasure Hunt) ఆగడం లేదు. గుప్తనిధుల కోసం కొందరు వ్యక్తులు గట్టు మండల కేంద్రంలో గుట్టుగా తవ్వకాలకు పాల్పడుతున్నారు. పాడు బడిన ఆలయాలు, గుట్టలు, పరిసరాల్లో విగ్రహాలను ధ్వంసం చేస్తూ పొక్లెయిన్లతో అడ్డగోలుగా తవ్వేస్తుండటం స్థానికంగా ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది.

గుప్త నిధుల ముఠాలు బరి తెగించి యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతుండటంతో గట్టు మండల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గతంలో గట్టు మండల కేంద్రంలోని బిచ్చల పేటలో రెండు సార్లు తవ్వకాలు జరపడంతో భారీ ఎత్తున నిధులు దొరికినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.

అదే విధంగా నేతాజీ సర్కిల్ సమీపంలో ఇంటి గోడ కూలుస్తుండగా కూలీలకు దొరికిన గుప్త నిధుల వ్యవహారం ఓ కొలికి వచ్చినప్పటికీ పూర్తిస్థాయిలో నిధులను స్వాధీనం చేసుకోలేదని అధికారులపై విమర్శలున్నాయి. తాజాగా ప్రభుత్వ హైస్కూల్ వెనుకాల ఉన్న గుట్టపై గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి వేళ క్షుద్ర పూజలు నిర్వహించి తవ్వకాలు చేపట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది.

మంగళవారం ఉదయం ఆ ప్రాంతానికి వెళ్లిన స్థానికులు గొయ్యిని చూసి నిర్ఘాంతపోయారు. గట్టు మండల కేంద్రంలో వరుసగా గుప్తనిధుల తవ్వకాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో‌ పోలీసుల గస్తీ ముమ్మరం చేయకపోవడం, నిఘా ఉంచకపోవడం వల్లే ముఠాలు మరింతగా రెచ్చిపోతున్నాయని ప్రజలు మండిపడుతున్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>