ఆటాడుకుందాం రా.. తెలంగాణలో ‘ఖేలో ఇండియా గేమ్స్’

కలం, తెలంగాణ బ్యూరో: తెలంగాణ క్రీడా చరిత్రలో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమవుతున్నది. ‘ఖేలో ఇండియా (Khelo India) యూత్ గేమ్స్’ 8వ ఎడిషన్‌ను డిసెంబర్‌లో తెలంగాణలో నిర్వహించనున్నారు. తొలిసారిగా ఈ ప్రతిష్టాత్మక క్రీడా పోటీలకు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వబోతున్నది. హైదరాబాద్‌తోపాటు వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్ నగరాల్లో పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 6 వేల మంది క్రీడాకారులు పాల్గొననుండా 25 క్రీడాంశాల్లో పోటీలు జరగుతున్నాయి. ఆతిథ్యరాష్ట్రంగా తెలంగాణకు ఒక స్థానిక క్రీడను ప్రతిపాదించే అవకాశం ఉండగా, అదనంగా మరో కొత్త క్రీడను కూడా ఈ ఎడిషన్‌లో చేర్చనున్నారు. డిసెంబర్‌లో ఈ క్రీడా సంబరాలకు లాంఛనంగా ప్రారంభోత్సవం చేయనున్నారు.

22 కోట్ల నిధులు విడుదల చేసిన కేంద్రం

ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రూ.22 కోట్లను విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్‌), నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (ఎన్ఎస్ఎఫ్), స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్జీఎఫ్ఐ), సీబీఎస్ఈ, ఖేలో ఇండియా అడ్‌హక్ కమిటీ, స్టీరింగ్ కమిటీల సమన్వయంతో పోటీలను నిర్వహించనున్నారు. యూత్ గేమ్స్‌తోపాటు యూనివర్సిటీ గేమ్స్, పారా గేమ్స్, వింటర్ గేమ్స్, బీచ్ గేమ్స్, వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్, ట్రైబల్ గేమ్స్ వంటి విభిన్న పోటీలను నిర్వహించనున్నారు. ఇప్పటివరకు జరిగిన 24 ఎడిషన్ల ఖేలో ఇండియా పోటీల్లో 60 వేల మందికి పైగా క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించినట్లు కేంద్రం వెల్లడించింది.

రూ.30 కోట్లతో క్రీడా వసతులు

ఖేలో ఇండియా పథకం కింద తెలంగాణలో సుమారు రూ.30 కోట్లతో క్రీడా మౌలిక వసతులు అభివృద్ధి చేసినట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. ఇందులో రూ.11.5 కోట్లతో ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో సింథటిక్ ట్రాక్, సింథటిక్ టెన్నిస్ కోర్ట్, మహిళల కోసం ప్రత్యేక స్విమ్మింగ్ పూల్ వంటి సదుపాయాలు కల్పించినట్లు వివరించారు. మరో రూ.18.5 కోట్లతో రాష్ట్రంలోని వివిధ పట్టణాల్లో క్రీడా మౌలిక వసతులను అభివృద్ధి చేసినట్లు చెప్పారు. తెలంగాణలో 33 ఖేలో ఇండియా సెంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నేషనల్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద మరో రూ.8.5 కోట్లను రాష్ట్ర క్రీడాభివృద్ధికి ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>