కలం, తెలంగాణ బ్యూరో: మంత్రివర్గం నుంచి కొండా సురేఖకు (Konda Surekha) ఉద్వాసన ఖాయమనే సంకేతాలు వినిపిస్తున్నాయి. నేడో రేపో ఏఐసీసీ నుంచి ప్రకటన రావచ్చన్న తీరులో గాంధీభవన్ వర్గాలు అనుకుంటున్నాయి. దీంతో సురేఖ స్థానంలో మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకుంటారన్న చర్చ కూడా మొదలైంది. ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మికి స్థానం లభించే అవకాశమున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా ఉన్న ఆమెను కేబినెట్‌లోకి తీసుకోవడం రెండు రకాలుగా సహేతుకంగా ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
రాష్ట్రంలో బలమైన బీసీ సామాజికవర్గానికి ప్రాతినిధ్యం కల్పించారన్న మెసేజ్‌తో పాటు కొండా సురేఖ స్థానంలో మహిళకే పార్టీ అవకాశం కల్పించిందనేది కూడా బ్యాలెన్స్ అవుతుందని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తున్నది. అదే సామాజికవర్గానికి చెందిన వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ విజయశాంతి పేర్లు కూడా మంత్రి పదవి రేసులో వినిపిస్తున్నాయి. కొండా సురేఖపై చర్యల ప్రకటన ఏఐసీసీ నుంచి వెలువడిన తర్వాత కొత్తగా మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలనేది స్పష్టం కానున్నది.
ఎమ్మెల్సీగా తీసుకొని..!
- రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా ఉన్న గద్వాల విజయలక్ష్మి ప్రస్తుతం ఉభయ సభల్లో సభ్యురాలు కానందున మంత్రివర్గంలోకి తీసుకున్న తర్వాత ఎమ్మెల్సీ కోటా కింద కంటిన్యూ అయ్యేలా పార్టీ నాయకత్వం ఆలోచిస్తున్నది.
- వచ్చే ఏడాది మార్చిలో రెండు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతుండడంతో ఎన్నికలు జరగనున్నాయి. అప్పటివరకూ ఆగడమా?.. లేక ఆల్టర్నేట్‌గా మరో రూపంలో విజయలక్ష్మిని ఎమ్మెల్సీ చేయడమా అనేది రానున్న రోజుల్లో తేలనున్నది.
- ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఉన్న ఎవరో ఒకరి చేత రిజైన్ చేయించి ఆ వ్యక్తికి పార్టీలో మంచి పదవి ఇవ్వడమో లేక కీలకమైన నామినేటెడ్ పోస్టు ఇవ్వడమో చేసి ఆ ఎమక్మెల్సీ స్థానంలో గద్వాల విజయలక్ష్మిని ఎన్నిక చేసే అవకాశమూ లేకపోలేదు.
- ఖాళీ కానున్న రెండు గ్రాడ్యుయేట్స్ స్థానాలకు దాదాపుగా ఇద్దరు అభ్యర్థులను ఖరారు చేసినందున కచ్చితంగా గెలుస్తారన్న కోటా కిందనే విజయలక్ష్మిని ఎమ్మెల్సీ చేయడం ఉత్తమం అనే సంకేతాలు కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. తొలుత ఏఐసీసీ నుంచి కొండా సురేఖ ఉద్వాసన ప్రకటన వచ్చిన తర్వాత తదుపరి మంత్రి అవకాశంపై చర్చలు మొదలు కానున్నాయి.
రేసులో ఆది శ్రీనివాస్, విజయశాంతి కూడా..!
ఆది శ్రీనివాస్, విజయశాంతి ఎలాగూ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా ఉన్నందున మరో ఆలోచన లేకుండా ఈ ఇద్దరిలో ఎవరో ఒకరిని ఎంపిక చేయడంపైనా కొద్దిమంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ మహిళ స్థానంలో మరో మహిళకు అవకాశం ఇవ్వడమే సమంజసమనేది వారి వాదన. రాష్ట్ర నేతల అభిప్రాయాల అనంతరం ఏఐసీసీ దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నది. వీరిలో ఒకరిని ఎంపిక చేసుకునేటట్లయితే ఎలాంటి ఎన్నికల అవసరం లేకుండా వెంటనే తీసుకొవచ్చనే వెసులుబాటు కూడా ఉన్నది. కానీ.. రాష్ట్ర, కేంద్ర నాయకత్వం ఆలోచనలు, సోషల్ జస్టిస్, జెండర్ ఈక్వాలిటీ తదితరాలను పరిగణనలోకి తీసుకుని హైకమాండ్ తుది నిర్ణయం తీసుకోనున్నది. వచ్చే నెల 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున ఆ తర్వాతనే కొత్త మంత్రి ప్రమాణ స్వీకారానికి అవకాశాలున్నాయి. గద్వాల విజయలక్ష్మి గతంలో జీహెచ్ఎంసీ మేయర్‌గానూ పనిచేసినందున త్వరలో జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఆమెను మంత్రివర్గంలోకి తీసుకుంటే కలిసి వస్తుందన్న అభిప్రాయామూ కొందరు నేతల నుంచి వినిపిస్తున్నది.

