కాంగ్రెస్ ‘420’ హామీలపై సమర శంఖం.. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపు!

కలం, కరీంనగర్ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడిచినప్పటికీ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను నెరవేర్చకుండా ప్రజలను తీవ్రంగా మోసగించిందని బీఆర్ఎస్ పార్టీ మండిపడింది. ఈ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టి, ప్రజల దృష్టికి తీసుకెళ్లే విధంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా వారం రోజుల పాటు పలు కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పార్టీ ముఖ్య నాయకుల సన్నాహక సమావేశం మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (Gangula Kamalakar) అధ్యక్షతన అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు.

​కేసీఆర్ హయాంలో అద్భుత అభివృద్ధి: గంగుల కమలాకర్

​ఈ సందర్భంగా ముఖ్య నాయకులను ఉద్దేశించి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రసంగిస్తూ.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రాష్ట్రం ఏర్పడిన ఆరు రోజుల్లోపే రూ.120 కోట్లతో కరీంనగర్ సిటీ రేనోవేషన్ పేరుతో నగరాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసిన సువర్ణావకాశాలను గుర్తు చేశారు.​ అర్హత లేకున్నా కరీంనగర్‌కు ‘స్మార్ట్ సిటీ’ హోదాను సాధించి, వందల కోట్లు వెచ్చించి నందనవనంలా తీర్చిదిద్దామని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నగరం ఎంత సుందరంగా, ప్రశాంతంగా ఉండేదో ప్రజలందరికీ తెలుసునని అన్నారు. కానీ, 2023 ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అలవి కాని హామీలనిచ్చి, ఏ ఒక్కటీ నెరవేర్చకుండా ప్రజలను తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తోందని ఆగ్రహించారు. కేంద్ర, రాష్ట్రాల్లో అధికారాలు ఉన్నప్పటికీ, నగరపాలక సంస్థ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను నమ్మి 10 కార్పొరేటర్ స్థానాలు కట్టబెట్టిన ప్రజల కు కృతజ్ఞతలు తెలియచేశారు.

రైతాంగం గోస, 22ఏ సెక్షన్ దందాలు, ఉద్యోగుల ఆత్మహత్యలు

​బీఆర్ఎస్ హయాంలో రూరల్ మండలంలోని ఆచంపల్లి వద్ద తూము ఏర్పాటు చేసి కాళేశ్వరం నీటిని మళ్లించి ఏడు గ్రామాలను సస్యశ్యామలం చేశామని, కానీ నేడు అదే రూరల్ మండలంలో సాగునీరు అందక రైతులు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సారెస్పీ కాలువ ద్వారా నీటిని అందించి రైతుల కష్టాలు తొలగించాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. పాలనలో అధికారుల మధ్య సమన్వయం కొరవడిందని, ముఖ్యమంత్రి మాట మంత్రులు వినడం లేదని, మంత్రుల మాట ఎమ్మెల్యేలు వినడం లేదని ఎద్దేవా చేశారు. కేవలం అందినకాడికి దోచుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పాలన సాగుతోందని, ఈ అక్రమాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదని పేర్కొన్నారు.

ముఖ్యంగా 22ఏ సెక్షన్ కింద కోటి 25 లక్షల ఎకరాలను నిషేధిత భూముల జాబితాలో చేర్చారని.. అందులో భాగంగా కరీంనగర్‌లోని రేకుర్తి, సీతారాంపూర్, చింతకుంట, కొత్తపెళ్లి తదితర ప్రాంతాల ప్రైవేటు భూములను కూడా 22ఏ సెక్షన్ కింద చేర్చడం వెనుక వారి అక్రమ సంపాదన దాగుందని ఆరోపించారు. ఈ సెక్షన్‌ను తొలగించాలంటే భారీగా డబ్బులు ముట్టచెప్పాలనే ఆరోపణలు వస్తున్నాయని మండిపడ్డారు. మరోవైపు, జీవో 97 తీసుకొచ్చి పాలిటెక్నిక్ విద్యార్థులకు విద్యను దూరం చేసే కుట్ర జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు డిఏలు లేవని, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు అందక ఆత్మహత్యలకు పాల్పడుతున్న దౌర్భాగ్యపు పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. కల్యాణ లక్ష్మి కింద ఇస్తామన్న ‘తులం బంగారం’ హామీని ఎగవేసి పేద ప్రజలను వంచించారని దుయ్యబట్టారు. ఖజానాను పంచుకోవడం కోసమే ఈ పాలన సాగుతోందని, కాంగ్రెస్ పార్టీ ఇక 15 ఏండ్లు అధికారంలోకి రాదని ఆ పార్టీ ఎమ్మెల్యేలే అంటున్నారని ఎద్దేవా చేశారు.

​ఆరు రోజుల పాటు నిరసనల హోరు.. షెడ్యూల్ ఇలా

కార్యకర్తలే తన బలమని, వారి రక్తం ధారతోనే తాను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని గుర్తుచేసిన గంగుల కమలాకర్… ప్రభుత్వ వైఫల్యాలపై నిరంతరం పోరాటం చేస్తేనే ప్రభుత్వానికి చెవుడు వదులుతుందని విమర్శించారు. కరీంనగర్ నియోజకవర్గంలోని 2 లక్షల 60 వేల మంది ప్రజల సంక్షేమం కోసం పార్టీ శ్రేణులు రణభేరి మోగించాలని పిలుపునిచ్చారు. పార్టీ నాయకత్వ ఆదేశాల మేరకు చేపట్టే ఈ వారం రోజుల నిరసన కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

షెడ్యూల్ ప్రకారం.. సెప్టెంబర్ 2న ప్రభుత్వం ఇచ్చిన 420 హామీల వైఫల్యాలకు నిరసనగా.. ‘420 అడుగుల భారీ ఫ్లెక్సీ’తో తెలంగాణ చౌక్‌లో మానవహారం నిర్వహించి, ప్రజలకు ప్రభుత్వ ‘బాకీ కార్డుల’ను అందించడం జరుగుతుందని గంగుల కమలాకర్ తెలిపారు. ​సెప్టెంబర్ 3న 22ఏ నిషేధిత భూముల బాధితులతో కలిసి తెలంగాణ చౌక్ నుండి కలెక్టరేట్ వరకు భారీ నిరసన ర్యాలీ ఉంటుందని.. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరు అవుతారని చెప్పారు. సెప్టెంబర్ 4న వృద్ధులు, వికలాంగుల సమస్యలపై ప్రత్యేక ఆందోళన కార్యక్రమాలు ఉంటాయన్నారు. ​సెప్టెంబర్ 5న విద్యార్థులు, యువతతో కలిసి సర్కస్ గ్రౌండ్ నుండి కలెక్టరేట్ వరకు జరిగే భారీ నిరసన ర్యాలీలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు. సెప్టెంబర్ 6న నగరంలో నెలకొన్న సమస్యలపై వార్డులలో గ్రామపంచాయతీలలో నిరసన కార్యక్రమం ఉంటుందన్న గంగుల.. సెప్టెంబర్ 7న జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ప్రజావాణిలో , అన్ని మండల కేంద్రాల ప్రజావాణి కేంద్రాల్లో వినతి పత్రాల సమర్పణ ఉంటుందని వివరించారు. సెప్టెంబర్ 8న అంబేద్కర్ విగ్రహాల వద్ద ప్రజా సమస్యలపై వినతి పత్రాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు.

​ఈ సమావేశంలో ఎమ్మెల్యే గంగులతో పాటు కరీంనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్‌చార్జి కొండూరు రవీందర్ రావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, రూరల్ మండల అధ్యక్షులు పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, కొత్తపల్లి మండల అధ్యక్షులు కాసారపు శ్రీనివాస్ గౌడ్, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, భారాస కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, తదితర ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>