వెయ్యి రోజులు.. వెయ్యి అబద్ధాలు: కాంగ్రెస్‌ పాలనపై ఏలేటి ఫైర్

కలం, నిర్మల్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అస్తవ్యస్తం చేసిందని బీజేఎల్పీ నేత, నిర్మల్‌ ఎమ్మెల్యే (Nirmal MLA) ఏలేటి మహేశ్వర్‌రెడ్డి (Alleti Maheshwar Reddy) తీవ్రస్థాయిలో విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రెడ్‌ అలర్ట్‌లో ఉందని ఆరోపించారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం కాంగ్రెస్‌ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనపై రూపొందించిన చార్జిషీట్‌ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ వెయ్యి రోజుల పాలనలో ‘వెయ్యి అబద్ధాలు.. వెయ్యి మోసాలు’ తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కుంభకోణాలు, అవినీతి, శాంతిభద్రతల వైఫల్యమే కనిపిస్తోందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం చేస్తోందని మండిపడ్డారు.

ఆరు గ్యారెంటీలపై నిలదీత

ఆరు గ్యారెంటీలకు (Six Guarantees) చట్టబద్ధత కల్పిస్తామని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పుడు ఆ మాటను విస్మరించిందని ఆరోపించారు. రైతులకు రైతు భరోసా, మహిళలకు చేయూత పింఛన్లు, వికలాంగులకు రూ.6,016 పింఛన్‌, ఇందిరమ్మ ఇళ్లు  గృహజ్యోతి, కౌలు రైతులకు భరోసా, ధాన్యానికి బోనస్‌, యువతకు యూత్‌ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలు, పెండింగ్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంటి అంశాలలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు.

విద్యారంగం అస్తవ్యస్తం

రాష్ట్రంలో విద్యావ్యవస్థ పూర్తిగా గాడితప్పిందని మహేశ్వర్‌రెడ్డి (Nirmal MLA) విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలకు కనీసం సరైన బాత్రూంలు కూడా లేని పరిస్థితి నెలకొందని అన్నారు. జీవో 97 తీసుకొచ్చి పాలిటెక్నిక్‌ విద్యార్థుల భవిష్యత్‌తో ప్రభుత్వం చెలగాటమాడుతోందని మండిపడ్డారు. బాసర ట్రిపుల్‌ ఐటీలో వేలాది మంది విద్యార్థులు చదువుతుండగా కేవలం 19 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు. ఇంత తక్కువ సిబ్బందితో విద్యార్థులకు నాణ్యమైన విద్య ఎలా అందిస్తారని ప్రశ్నించారు. సుమారు 9 వేల మంది విద్యార్థులు ఉన్న విశ్వవిద్యాలయానికి రూ.40 కోట్లు మాత్రమే కేటాయిస్తే అది ఎలా కొనసాగుతుందని నిలదీశారు. ఉస్మానియా, కాకతీయ, జేఎన్‌టీయూ, తెలంగాణ యూనివర్సిటీల్లో 60 శాతం ఫ్యాకల్టీ కూడా లేదని ఆరోపించారు. విద్యారంగానికి తగిన బడ్జెట్‌ కేటాయించకుండా ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలకు వెళ్లడం సరికాదన్నారు.

రూ.4 లక్షల కోట్ల అప్పులు చేశారంటూ ఆరోపణ

రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం అప్పుల ఊబిలోకి నెట్టిందని మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అప్పులకు తాము కూడా తక్కువ కాదన్నట్లుగా కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో సుమారు రూ.4 లక్షల కోట్ల అప్పులు చేసిందని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులకు రెండో పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగులపై కక్షసాధింపు చర్యలు నిలిపివేయాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని కోరారు.

22-ఏ అంశంపై బీజేపీ దీక్ష

ఆర్టీసీని కాపాడాలని, ట్రాన్స్‌కో బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని మహేశ్వర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. 22-ఏ పేరుతో ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సెప్టెంబర్‌ 5, 6 తేదీల్లో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలంతా కలిసి దీక్ష చేపడతారని ప్రకటించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీజేపీ ఆధ్వర్యంలో మరింత ఉధృతంగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

Also Read : రామచందర్ రావుకు నితిన్ నబిన్ ఫోన్.. దాడులపై ఆరా!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>