కలం, నిర్మల్: నల్గొండ బీజేపీ జిల్లా అధ్యక్షుడు వర్షిత్‌రెడ్డి (Varshit Reddy) నివాసంపై కాంగ్రెస్ నాయకులు చేసిన దాడిని ఖండిస్తూ, ఆయనను పరామర్శించేందుకు వెళ్తున్న బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డిని (MLA Alleti) పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని బీజేపీ పార్టీ కార్యాలయం నుంచి వర్షిత్‌రెడ్డి నివాసానికి బయలుదేరిన ఏలేటి మహేశ్వర్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసు వాహనంలో మలక్‌పేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏలేటి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా క్షీణించిందని ఆరోపించారు. బీజేపీ పార్టీ కార్యాలయాలు, నాయకుల ఇళ్లపై కాంగ్రెస్ నాయకులు దాడులకు పాల్పడుతున్నా పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడం సరికాదన్నారు.
దాడులు చేసేవారిని వదిలేసి.. బాధితులను పరామర్శించేందుకు వెళ్లే బీజేపీ నాయకులను అరెస్ట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు దాడులకు పాల్పడుతుంటే.. పోలీసులు బీజేపీ నేతలను అరెస్టులు, గృహనిర్బంధాలతో అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. లా అండ్ ఆర్డర్‌ను కాపాడాల్సిన పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం మానుకోవాలని ఏలేటి డిమాండ్ చేశారు. దాడులకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

