‘దీక్షా దివస్’ ఏర్పాట్ల‌పై గంగుల క్షేత్ర స్థాయి ప‌రిశీల‌న‌

కలం, కరీంనగర్: బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీ నిర్వహించనున్న దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ నాయకత్వం సన్నాహాలు ముమ్మరం చేసింది. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా అలుగునూర్‌లో సభ నిర్వహించనున్న ప్రాంతాన్ని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (Gangula Kamalakar) పార్టీ ముఖ్య నాయకులతో కలిసి శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నరాదాసు లక్ష్మణరావు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, జమ్మికుంట మాజీ మున్సిపల్ ఛైర్మన్ రాజేశ్వర్‌రావు, మానకొండూర్ మాజీ జడ్పిటీసి తాళ్లపల్లి శేఖర్ గౌడ్, కొత్తపల్లి మండల మాజీ వైస్ ఎంపీపీ తిరుపతి నాయక్, పలువురు బీఆర్‌ఎస్ నాయకులు కలిసి సభాస్థలి పరిసరాల్లో పర్యటించారు.

ఈ సందర్భంగా సభ నిర్వహణకు అనువైన ప్రాంతం, వేదిక ఏర్పాటు, సభకు హాజరయ్యే నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. ముఖ్యంగా సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వాహనాల పార్కింగ్‌కు అనువైన స్థలాలను పరిశీలించారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా పార్కింగ్ ప్రాంతాల ఎంపిక, సభా ప్రాంగణానికి వచ్చే మార్గాలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై నాయకులు సమాలోచనలు జరిపారు.

ఈ నెల 29న నిర్వహించనున్న దీక్షా దివస్ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. దీంతో అలుగునూర్‌లో నిర్వహించనున్న ఈ సభకు రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో సభా ప్రాంగణం ఎంపిక మొదలుకొని పార్కింగ్, ఇతర ఏర్పాట్ల వరకు ఎలాంటి లోటు పాట్లు లేకుండా నిర్వహించేందుకు పార్టీ ముఖ్య నాయకులు సమాయత్తమవుతున్నారు. దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లను ముందుకు తీసుకెళ్లే దిశగా గంగుల కమలాకర్ నేతృత్వంలో నాయకులు సభాస్థలిని పరిశీలించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>