కలం, ఖమ్మం బ్యూరో: పేదవారి సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) స్పష్టం చేశారు. శుక్రవారం నేలకొండపల్లి మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజతో కలిసి నూతనంగా మంజూరైన చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను (Pension Sanction Letters) లబ్ధిదారులకు మంత్రి అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత ఏడెనిమిది ఏళ్లుగా భర్తలను కోల్పోయి పింఛన్ల కోసం కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగిన ఆడబిడ్డలు, వికలాంగులు, గీత, చేనేత కార్మికుల వేదనను స్వయంగా చూశామని తెలిపారు. అర్హులైన ప్రతి పేదవాడికి భరోసా కల్పించేందుకే మొన్న దీపావళి పండుగ నాడు రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల మందికి పైగా నూతన చేయూత పింఛన్లు మంజూరు చేసి, వారి ఇళ్ల వద్దే శుభవార్త అందించామన్నారు.
పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలంలో కొత్తగా 1,138 మందికి పింఛన్లు మంజూరయ్యాయని, పాత వాటితో కలిపి ఈ ఒక్క మండలానికే ప్రజా ప్రభుత్వం ప్రతి నెలా రూ. 1.82 కోట్లు నేరుగా పంపిణీ చేస్తోందని వెల్లడించారు. ఇంకా ఎవరైనా అర్హులు మిగిలిపోయి ఉంటే త్వరలోనే వారికి కూడా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా సంక్షేమ పథకాల అమలులో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని మంత్రి తేల్చి చెప్పారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు సన్నబియ్యం అందిస్తున్నామని, ఏడేళ్లుగా పెండింగ్లో ఉన్న కొత్త రేషన్ కార్డులతో పాటు కుటుంబాల్లో కొత్త సభ్యుల పేర్లను చేర్చామన్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం విజయవంతంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. మహిళలను కోటీశ్వరులను చేసే సంకల్పంతో రూ. 73 వేల కోట్ల సున్నా వడ్డీ రుణాలతో పాటు వారికి పెట్రోల్ బంకులు, రైస్ మిల్లులు కూడా కేటాయిస్తూ ఆర్థికాభివృద్ధికి అండగా నిలుస్తున్నామని వివరించారు.
అలాగే రైతులకు రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేయడంతో పాటు ఎకరానికి రూ. 12 వేల చొప్పున రైతు భరోసా, సన్నవడ్లకు మద్దతు ధరతో పాటు క్వింటాలుకు రూ. 500 బోనస్ అందిస్తున్నామని తెలిపారు. గత పాలకులు కమీషన్ల కక్కుర్తితో కాళేశ్వరం కట్టారే తప్ప, పేదోడికి ఇళ్లు నిర్మించలేదని మంత్రి విమర్శించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి విడతలో 4.5 లక్షలు, రెండో విడతలో 2.5 లక్షలు, హైదరాబాద్లో ఒక లక్ష కలిపి మొత్తం 8 లక్షల ఇళ్లను రూ. 40 వేల కోట్ల వ్యయంతో పేద ఆడబిడ్డలకు మంజూరు చేస్తున్నామన్నారు.
కులమతాలు, రాజకీయ పార్టీలకు అతీతంగా ‘పింక్ షర్టు వేసుకుని వచ్చినా’ సరే, అర్హులైన ప్రతి పేద మహిళకు ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో కె. శ్రీరామ్, హౌజింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, నేలకొండపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, ఎంపీడీఓ ఎర్రయ్య, తహసీల్దార్ రాంప్రసాద్, పలు గ్రామాల సర్పంచులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

