కలం, వరంగల్ బ్యూరో: అదొక చిన్న ఊరు.. అందరిదీ ఒకే మాట, ఒకే బాట. సమష్టి కృషితో విద్య, వైద్యం, విద్యుత్, పారిశుద్ధ్యం.. ఇలా అన్నింటిలోనూ పైచేయి సాధించారు. కలిసి ఉంటే ఎలాంటి ఫలితాలైనా రాబట్టవచ్చని నిరూపించారు. ప్రధాని మోడీ సైతం ఆ ఊరి అభివృద్ధిని చూసి ముచ్చటపడ్డారు. సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన ప్రారంభించి గ్రామస్తులను మెచ్చుకున్నారు. కొత్త సర్పంచులు కొలువుదీరుతున్న నేపథ్యంలో ఈ గ్రామం అందర్నీ ఆకట్టుకుంటోంది. ఆ గ్రామమే గంగదేవిపల్లి (Gangadevipalli)
చిన్న ఊరు.. పెద్ద పేరు
గంగదేవిపల్లి.. వరంగల్ నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామంలో 1277 మంది జనాభా, 980 మంది ఓటర్లున్నారు. గంగదేవిపల్లి గ్రామం ఒకప్పుడు మచ్ఛాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో ఉండేది. 1994 సెప్టెంబర్‌లో గ్రామపంచాయతీ హోదాను పొందింది. పంచాయతీగా ఏర్పడిన తర్వాత మహిళ సర్పంచ్ వార్డు సభ్యులు, ప్రజల భాగస్వామ్యంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు. స్త్రీ, పురుషులు అనే తారతమ్యం లేకుండా కలిసి పనిచేశారు. పాలనలో తనదైన ముద్ర వేసి దేశ, విదేశాలకు చెందిన ప్రతినిధులతో అవార్డులు (Awards) అందుకున్నారు.
అతివలకే అందలం
గ్రామపంచాయితీ ఏర్పడిన నాటి నుండి పదకొండేళ్లపాటు మహిళలే (Women) పాలనను కొనసాగించారు. 1995లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. రెండు పర్యాయాలు సర్పంచ్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ కావడం, గ్రామంలో 8 వార్డులు ఉండటంతో మహిళలనే ఎన్నుకోవాలని గ్రామస్తులు నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత వార్డు సభ్యులు ఏకగ్రీవంగా కూసం రాజమౌళిని గ్రామ సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. ఆయన పదవీ కాలం ముగిసిన తర్వాత సర్పంచ్, వార్డు సభ్యులందరిని మహిళలనే ఎన్నుకోవాలని గ్రామస్తులు నిర్ణయం తీసుకున్నారు. అలా తొలి సర్పంచ్‌గా కూసం లలిత, వార్డు సభ్యులుగా మహిళలే పాలన సాగించారు. ప్రజా సహకారంతో గ్రామాభివృద్ధికి కృషి చేశారు. రెండోసారి కూడా మహిళలనే ఎన్నుకోవాలని మెజారిటీ గ్రామస్తులు నిర్ణయించారు. గ్రామ సర్పంచ్ పదవి ఎవరైనా పోటీచేసే విధంగా జనరల్‌కు రిజర్వ్ చేశారు. ఓమారు ఆయా స్థానాల్లో మహిళలతోపాటు పురుషులు పోటీ కూడా బరిలో నిలిచారు. అయినప్పటికీ అన్ని స్థానాల్లో మహిళలే గెలుపొంది సత్తా చాటారు.
ప్రజల భాగస్వామ్యంతో కమిటీలు
ఎన్నికైనా మహిళలు ప్రజలను భాగస్వామ్యం చేస్తూ గ్రామ సభల ద్వారా తాగునీరు, పారిశుద్ధ్యం, ఆరోగ్యం లాంటి కీలక అంశాలపై 18 కమిటీలు వేసి అభివృద్ది చేసుకున్నారు. రోడ్లు, మరుగుదొడ్లు, వాటర్ ట్యాంక్‌లు నిర్మించటమే కాకుండా గ్రామాల్లో ప్లాస్టిక్ నిషేదించారు. ఇంటింటికి తాగునీరు అందించేలా చర్యలు చేపట్టారు.
అనేక అవార్డులు
అభివృద్ధిలో ఐక్యత చాటిన ఈ గ్రామానికి అనేక అవార్డులు వరించాయి. గంగదేవిపల్లి (Gangadevipalli) గ్రామ ప్రాముఖ్యత అందరికీ తెలియడంతో విదేశీ ప్రతినిధులు సందర్శించి అభినందనలు తెలిపారు. ఇప్పటివరకు 99 దేశాల ప్రతినిధులు ఈ గ్రామంలో పర్యటించి అభివృద్ధి గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తులు అద్భుత ఫలితాలు సాధించడంతో రాష్ట్ర ప్రభుత్వం 6వ తరగతిలో ’గంగదేవిపల్లి‘ గ్రామంపై పాఠాన్ని చేర్చడం నిజంగా ఆదర్శం.
Read Also: బెస్ట్ పోస్టాఫీస్ స్కీమ్స్.. వడ్డీ ఎక్కువ రిస్క్ తక్కువ
Follow Us On: Instagram


