epaper
Wednesday, February 18, 2026
epaper

వివాదాల ‘ఇంపాక్ట్’.. ఏఐ సమ్మిట్​లో రోబో డాగ్​ రభస

కలం, వెబ్​ డెస్క్​: దేశ రాజధానిలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్​ సమ్మిట్ ​(AI Impact Summit) ను వివాదాలు వదలడం లేదు. మొదటి రోజు మంగళవారం సౌకర్యాల కొరతతో తీవ్ర విమర్శలు చెలరేగగా ఏకంగా కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్​ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. నిన్న భారీ క్యూలు, దొంగతనాలు, గందరగోళం ఇబ్బంది పెట్టగా.. రెండో రోజైన బుధవారం చైనా రోబో డాగ్​ తీవ్ర వివాదానికి కారణమైంది.

అసలేమైందంటే..

ఏఐ సమ్మిట్​​లో నోయిడాకు చెందిన గల్గోటియాస్​​ యూనివర్సిటీ ఒక స్టాల్​ పెట్టింది. అందులో ఓ డాగ్​ రోబోను ప్రదర్శించింది. దాని పేరు ఓరియన్ ​(Orion)గా పేర్కొంది. దానిని తామే తయారుచేశామని, అందుకోసం రూ.350 కోట్లు ఖర్చయిందని యూనివర్సిటీ ప్రతినిధి మీడియాతో చెప్పారు. ఆ వీడియోలు సోషల్​ మీడియాలో వైరల్​ కావడంతో వివాదం రాజుకుంది.

ఆ రోబో డాగ్​ చైనాలో తయారైందని, దానిని యునిట్రీ అనే కంపెనీ తయారుచేసిందని, పేరు యునిట్రీ గో2(Unitree Go2) అని ఆధారాలతో సహా నెటిజన్లు పోస్ట్​ చేశారు. దాన్ని తామే తయారుచేశామని చెప్పుకోవడం సిగ్గుచేటంటూ విరుచుపడ్డారు. అంతేకాదు, కేంద్రంపైనా విమర్శలు గుప్పించారు. చైనా నెటిజన్లు ఈ వీడియోలను పోస్ట్​ చేస్తూ భారత్​ను ఎగతాళి చేసే రాతలు రాశారు. లోక్​సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్​ గాంధీ సైతం కేంద్రం తీరును ఎండగట్టారు. సరైన ప్రణాళిక లేకుండా, కేవలం పేరు, ప్రచారం కోసం ప్రధాని మోదీ ప్రభుత్వం పాకులాడుతోందని విమర్శించారు. పరిస్థితి ఇబ్బంది కరంగా మారడంతో కేంద్రం స్పందించింది. గల్గోటియాస్​ స్టాల్​ను ఖాళీ చేయించింది.

దక్షిణ కొరియా డ్రోన్​నూ..

మరోవైపు గల్గోటియాస్​ ప్రతినిధులు మాత్రం ఆ రోబోను తాము తయారుచేశామని చెప్పలేదని, అది చైనాలో తయారైందని, తమ విద్యార్థులకు వివరించేందుకు కొన్నామని చెప్పింది. అయితే, ఇదొక్కటే కాదు, గల్గోటియాస్​ స్టాల్​లోని ఒక డ్రోన్​కు సంబంధించి కూడా వివాదం తలెత్తింది. దక్షిణ కొరియాలో తయారైన ఆ డ్రోన్​ను తామే తయారుచేశామని గల్గోటియాస్​ ప్రతినిధులు అనడమే దీనికి కారణం.

జనసంద్రం.. సమ్మిట్​ పొడిగింపు..

వివాదాలు, సౌకర్యాల లేమి ఉన్నా ఏఐ ఇంపాక్ట్​ సమ్మిట్​కు (AI Impact Summit) మాత్రం ఊహించినదాని కంటే భారీ స్థాయిలో సందర్శకులు పోటెత్తుతున్నారు. అంతర్జాతీయ, జాతీయ స్థాయి కంపెనీల వ్యవస్థాపకులు, అత్యున్నత అధికారులు, స్టార్టప్​లు, వివిధ దేశాల ప్రభుత్వ ప్రతినిధులు హాజరవడంతో సమ్మిట్​ జనసంద్రంతో కిటకిటలాడుతోంది. దీంతో కేంద్రం సమ్మిట్​ గడువును పొడిగించింది. షెడ్యూల్​ ప్రకారం ఈ నెల 16 నుంచి 20 వరకు ఇండియా ఏఐ ఇంపాక్ట్​ జరగాల్సి ఉంది. అయితే, 21వరకు జరిపేందుకు కేంద్రం నిర్ణయించింది.

Read Also: హామీ 42%.. గెలిచింది 62%.. ‘మున్సిపోల్స్’లో రిజర్వేషన్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>