కలం, వెబ్ డెస్క్ : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) గగన్‌యాన్ (Gaganyaan) ప్రయోగానికి సంబంధించి కీలకమైన రెండో ఇంటిగ్రేటెడ్ ఎయిర్-డ్రాప్ టెస్ట్ (IADT)ను శుక్రవారం విజయవంతంగా పూర్తి చేసింది. 2025 ఆగస్టులో నిర్వహించిన మొదటి పరీక్ష తర్వాత, పారాచూట్ వ్యవస్థ పనితీరును, సురక్షిత ల్యాండింగ్ సామర్థ్యాన్ని మరింత పటిష్టంగా పరీక్షించేందుకు ఈ ప్రయోగాన్ని చేపట్టారు. అంతరిక్షం నుండి వ్యోమగాములు తిరిగి భూమికి వచ్చే సమయంలో క్రూ మాడ్యూల్ సముద్రంలో క్షేమంగా ల్యాండ్ కావడానికి అవసరమైన రికవరీ వ్యవస్థలను ఈ పరీక్ష ద్వారా శాస్త్రవేత్తలు క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ ప్రయోగంలో భాగంగా సుమారు 5.7 టన్నుల బరువున్న క్రూ మాడ్యూల్‌ను భారత వైమానిక దళానికి చెందిన చినూక్ హెలికాప్టర్ సహాయంతో శ్రీహరికోట తీరంలోని బంగాళాఖాతంపై 3 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి గాలిలో వదిలిపెట్టారు. ఆ వెంటనే క్రూ మాడ్యూల్ తన స్వయంప్రతిపత్త వ్యవస్థల ద్వారా డ్రోగ్, మెయిన్ పారాచూట్లను సకాలంలో విప్పడం ద్వారా వేగాన్ని నియంత్రించుకుంది. అనంతరం నిర్ణయించిన ప్రాంతంలో అత్యంత సున్నితంగా సముద్రపు నీటిలో దిగడంతో ప్రయోగం సఫలమైంది. ఈ పరీక్ష విజయవంతం కావడంతో గగన్‌యాన్ (Gaganyaan) ప్రయోగానికి అవసరమైన రక్షణ వ్యవస్థలపై ఇస్రో (ISRO)కు మరింత విశ్వాసం లభించింది.

