కలం ,మహబూబ్ నగర్ బ్యూరో: జోగులాంబ గద్వాల (Gadwal ) జిల్లా ఎర్రవల్లికి చెందిన యువతి ఇందు(19)శుక్రవారం సాయంత్రం కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ట్రీట్మెంట్ నడుస్తూనే ఉండగా శనివారం ఆ యువతి మృతి చెందింది. అయితే కడుపు నొప్పి అని వస్తే తమ కుమార్తెను కాటికి పంపారంటూ మృతురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట ఉన్న రోడ్డు పై ఆదివారం రాస్తారోకో చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే ఇందు మృతి చెందిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు ధర్నా చేస్తున్నారు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
కుటుంబానికి భరోసానివ్వాలి
గద్వాల ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందిన యువతి కుటుంబానికి ప్రభుత్వం భరోసా ఇవ్వాలంటూ బాధితులు ఆందోళన చేపట్టారు. జిల్లా కలెక్టర్ స్పష్టమైన హామీ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ రాస్తారోకోలు వివిధ పార్టీలకు చెందిన స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

